japan election results: జపాన్ పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల్లో అధికార దివంగత షింజో అబేకు చెందిన 'లిబరల్ డెమొక్రాటిక్ పార్టీ' విజయం సాధించింది. 248 సీట్లు ఉన్న సభలో మిత్రపక్షాలతో కలిసి 148 సీట్లు సాధించింది. దీంతో దిగువ సభతో పాటు.. ఎగువ సభలోనూ అధికార పార్టీకి ఆధిక్యం లభించింది. 2025లో సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు నిరాంటకంగా పాలించాలనుకుంటున్న ప్రస్తుత జపాన్ ప్రధాని పుమియో కిషిదకు ఇది కలిసొచ్చే అంశం. జపాన్ మాజీ ప్రధాని షింజో అబెే హత్యకు గురైన నేపథ్యంలో సానుభూతి పవనాలు అధికార పార్టీకి కలిసొచ్చాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జపాన్ పార్లమెంట్ ఎగువ సభకు ఆదివారం పోలింగ్ జరగగా.. సోమవారం ఫలితాలు వెలువడ్డాయి.
ఎగువ సభలో తాజా విజయంతో మూడొంతుల రెండొంతుల మెజార్టీ అధికార పార్టీకి లభించినట్లైంది. ఫలితాలపై స్పందించిన జపాన్ ప్రధాని కిషిద పార్టీ విజయాన్ని స్వాగతించారు. అయినా షింజో అబెే లేకుండా పార్టీని నడపడం కష్టతరమని అన్నారు. కొవిడ్, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, పెరుగుతున్న ధరలు లాంటి సమస్యలపై పనిచేయడమే తమ తొలి ప్రాధాన్యమని కిషిద తెలిపారు. దేశ భద్రతను పటిష్ఠం చేయడం, రాజ్యాంగ సవరణ కోసం కూడా ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. అంతకుముందు కిషిద, పార్టీ సభ్యులు అబే మృతికి సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించారు.