పెళ్లి.. విడాకులు.. పెళ్లి.. విడాకులు.. రిపీట్! జపాన్‌కు చెందిన ఓ యువ జంట లైఫ్స్టోరీకి సంక్షిప్త రూపమిది. ఓ విషయంలో గొడవ పడ్డ వారిద్దరూ.. రాజీ మార్గంగా ఇలా చేస్తున్నారు. ప్రతి మూడేళ్లకు విడాకులు తీసుకుంటున్నారు. మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ఇదే సీన్ రిపీట్ చేస్తున్నారు. ఇలా చేయడం వెనుక ఓ వెరైటీ కారణం ఉంది. అదేంటంటారా?
ఇంటి పేరు కోసం..: పెళ్లి అయితే వధువు ఇంటి పేరు మారడం సంప్రదాయం. అయితే ఇటీవల ఆ ట్రెండ్ మారుతోంది. కొందరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నా తండ్రి ఇంటి పేరునే అలా కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది రాజకీయ, సినీ ప్రముఖులు ఇందుకు ఉదాహరణ. జపాన్‌కు చెందిన ఆ అమ్మాయి కూడా అలానే చేయాలనుకుంది. ఇదే ప్రేమికుల మధ్య గొడవకు దారితీసింది. 'మళ్లీ మళ్లీ పెళ్లి' ఒప్పందానికి కారణమైంది.
ఇంటి పేర్లకు సంబంధించి జపాన్‌లో ఓ చట్టం అమల్లో ఉంది. పెళ్లి అయితే.. భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే ఇంటి పేరు ఉండాలన్నది ఆ చట్టం సారాంశం. అంటే.. అమ్మాయి తన పేరులో.. అబ్బాయి ఇంటి పేరును చేర్చుకోవాలి. లేదా.. భర్త భార్య ఇంటి పేరు పెట్టుకోవాలి. ఆ యువ జంటకు మాత్రం ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. 'నీ ఇంటి పేరు నేనెందుకు పెట్టుకోవాలి' అన్నదే ఇద్దరి వాదన.
2016లో పెళ్లికి కొద్దిరోజుల ముందు, ప్రేమలో మునిగితేలుతున్న సమయంలోనే ఇద్దరి మధ్య ఈ గొడవ జరిగింది. ఇంటి పేరు కోసం విడిపోవడం ఎందుకని అనుకున్న వారు.. కాస్త ప్రశాంతంగా కూర్చుని ఆలోచించారు. జపాన్‌లోని ఆ చట్టం వల్ల గతంలో ఎవరైనా ఇలాంటి ఇబ్బంది పడ్డారా అని ఆరా తీశారు. చివరకు ఓ ఒప్పందానికి వచ్చారు.