Japan Release Radioactive Water into Sea:2011లో సంభవించిన సునామీ కారణంగా జపాన్‌లో దెబ్బతిన్న ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో పేరుకుపోయిన వ్యర్థ జలాలను గురువారం నుంచి పసిఫిక్ మహా సముద్రంలోకి విడుదల చేయనున్నారు. మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజల భద్రత, జపాన్ మత్స్యసంపద పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు. వ్యర్థ జలాల విడుదలపై జపాన్‌తోపాటు బయటి దేశాల్లో కూడా అవగాహన కల్పిస్తామని ఆయన వివరించారు. దశాబ్దాల సమయం పట్టే వ్యర్థ అణుజలాల విడుదల పూర్తి చేసి, ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రం మూసివేసే వరకు ప్రభుత్వం తన ప్రయత్నాలు కొనసాగిస్తుందన్నారు.
Fukushima Wastewater Release Plan :ఈ నిర్ణయాన్ని చుట్టుపక్కల దేశాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. ఐరాసపర్యవేక్షక సంస్థ- ఐఏఈఏ మాత్రం వ్యర్థ అణుజలాలను సముద్రంలోకి విడుదల చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. జపాన్ వద్ద శుద్ధి చేసినట్లు చెబుతున్న 1.34 మిలియన్ టన్నుల అణుజలాలు ఉన్నాయి. ఇవి 500 ఒలింపిక్స్ సైజు స్విమ్మింగ్ పూల్స్‌కు సమానం. 2011లో వచ్చిన సునామీ వల్ల ఫుకుషిమా అణువిద్యుత్తు కేంద్రం దెబ్బతినటం వల్ల.. అప్పటి నుంచి ఆ వ్యర్థజలాలను జపాన్ నిల్వచేసింది. ఇప్పుడు స్థలం సరిపోని పరిస్థితి ఏర్పడింది. దీంతో అణుజలాలను వివిధ దశల్లో శుద్ధిచేసి రాబోయే 30ఏళ్లు సముద్రంలోకి విడుదల చేయనున్నారు. జపాన్ ప్రధాని ఈ ప్లాంట్‌ను ఇప్పటికే సందర్శించారు. ఈ ప్లాంట్‌ను మూసివేయాలంటే నీటిని విడుదల చేయాల్సిందేనన్నారు. టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ ఈ నీటిని వడగట్టి 60 రకాల రేడియో యాక్టివ్ పదార్థాలను తొలిగిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ అణుజలాల్లో ట్రీటియం, కార్బన్-14 మూలకాలు ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
2011లో వచ్చిన భారీ భూకంపం ధాటికి ఫుకుషిమా అణు విద్యుత్తు ప్లాంట్ దెబ్బతింది. ఒకప్పటి సోవియట్‌లోని చర్నోబిల్ తర్వాత ఇదే అతిపెద్ద అణు ప్రమాదం ఇది. సుమారు లక్షన్నర మంది ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఇప్పుడు ఆ నీటి విడుదల ఆసియా-పసిఫిక్ దేశాల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. అణుజలాల కారణంగా మత్స్యసంపదకు డిమాండ్ పడిపోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా తదితర దేశాలు వ్యర్థ అణుజలాలను సముద్రంలోకి విడుదల చేయటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.