- 2023 జనవరి 1 నాటికి జపాన్ మొత్తం జనాభా 12.54 కోట్లు. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది దాదాపు 5 లక్షలు తక్కువ.
- జపాన్లో ఆ దేశ పౌరుల సంఖ్య భారీగా తగ్గింది. మొత్తం జనాభాలో జపనీయుల సంఖ్య 12.24 కోట్లు. అంతకుముందు సంవత్సరంతో పోల్చితే ఇది 8లక్షలు, అంటే 0.65శాతం తక్కువ.
- జపాన్ పౌరుల జనాభాలో క్షీణత నమోదవడం ఇది వరుసగా 14వ ఏడాది.
- జపాన్లో నివాసం ఏర్పరుచుకున్న విదేశీయుల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగింది.
- 2022లో జపాన్లో నివాసం ఉంటున్న విదేయుల సంఖ్య 2021తో పోల్చితే 10.7శాతం వృద్ధి చెందింది. మొత్తం జనాభాలో వీరి వాటా 2.4శాతం.
- జపాన్లో విదేశీయుల జనాభా లెక్కలు సేకరించడాన్ని అక్కడి ప్రభుత్వం 2013లో ప్రారంభించింది. ఆ తర్వాత వారి సంఖ్య ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి.
- 2008లో జపాన్ జనాభా గరిష్ఠ స్థాయిని తాకింది. ఆ తర్వాత నుంచి ఆ దేశ జనాభా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. జననాల రేటులో క్షీణతే ఇందుకు ప్రధాన కారణం. 2022లో జపాన్లో అత్యల్పంగా 7,71,801 జననాలు నమోదయ్యాయి.
- జననాల రేటులో క్షీణతకు అడ్డుకట్ట వేయడాన్ని తన ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా నిర్దేశించుకున్నారు జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా.
- జనాభా వృద్ధి కోసం రానున్న మూడేళ్ల పాటు సంవత్సరానికి 3.5 ట్రిలియన్ యెన్లు (25.2 బిలియన్ డాలర్లు) ఖర్చు చేస్తామని ప్రకటించారు జపాన్ ప్రధాని కిషిదా. శిశు జననం, పెంపకం; ఉన్నత విద్య అభ్యసించే వారికి మరిన్ని రాయితీలు వంటి ప్రోత్సాహాలతో కూడిన శిశు సంరక్షణ ప్యాకేజీ అమలుకు ఈ డబ్బును ఖర్చు చేస్తామని తెలిపారు.
- స్థానిక జనాభా తగ్గుదల నేపథ్యంలో విదేశీయులను ఆకట్టుకునేలా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది జపాన్ ప్రభుత్వం. శాశ్వత నివాస హక్కు కల్పించేలా వలస విధానంలో విప్లవాత్మక మార్పులు చేపడుతోంది.
- విదేశీ ఉద్యోగులు మరిన్ని రంగాల్లో పని చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రణాళికకు జపాన్ మంత్రివర్గం గత నెల ఆమోద ముద్ర వేసింది.
- అయితే.. జనాభా క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు జపాన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవి.. అసలు సమస్యను పరిష్కరించేలా లేవని అభిప్రాయపడుతున్నారు.
- విదేశీయుల్ని ఆకట్టుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉందన్నది నిపుణుల మాట. వేతనాల పెంపు, పని ప్రదేశంలో మరింత మెరుగైన వసతులు, మైనారిటీలనూ కలుపుకుని వెళ్లేలా సమాజంలో మార్పు తీసుకురావడం తప్పనిసరి అనేది వారి వాదన.
Japan Population Crisis : జపాన్లో భారీగా తగ్గిన జనాభా.. విదేశీయుల సంఖ్యలో వృద్ధి
Japan Population Decline : జపాన్లో జనాభా రికార్డు స్థాయిలో తగ్గింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఆ దేశంలోని 47 జిల్లాల్లోనూ జనాభా క్షీణించింది. అయితే.. అక్కడే నివాసం ఉండే విదేశీయుల సంఖ్య మాత్రం పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి ఉన్న వివరాల ఆధారంగా జపాన్ అంతర్గత వ్యవహారాలు, సమాచార మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
జపాన్ జనాభా క్షీణత