జపాన్ ప్రధాని ఫుమియో కిషిద.. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పశ్చిమ జపాన్‌లోని వకయామ రాష్ట్రం సైకజాకి పోర్టులో.. స్థానిక ఎన్నికల అభ్యర్థికి మద్ధతుగా ప్రచారం చేస్తున్న సమయంలో స్మోక్ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో కిషిదకు గాని, ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నవారికి కానీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
సరిగ్గా జపాన్ ప్రధాని ప్రసంగం ప్రారంభించగానే.. స్మోక్ బాంబు పేలింది. వెంటనే ఒక అనుమానితుడిని పోలీసులు పట్టుకున్నారు. ప్రధానిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. మాజీ ప్రధాని షింజే అబేను.. 9 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఒక దుండగుడు హత్యచేశాడు. ఇప్పుడు ప్రధాని కిషిద కూడా ప్రచారంలో ఉండగానే బాంబు దాడి జరిగింది. దీంతో జపాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందన..
కిషిద ఎన్నికల పర్యటనలో స్మోక్ బాంబు పేలడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటనను భారత్ తీవ్రంగా ఖండింస్తోందని తెలిపారు. ప్రమాదం నుంచి కిషిద సురక్షితంగా భయపడ్డారన్న మోదీ.. ఆయన నిరంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.
మే 19 నుంచి 21 తేది వరకు జపాన్‌లోని హిరోషిమా నగరంలో జీ7 దేశాల సమావేశాలు జరగనున్నాయి. కిషిద.. ఈ సమావేశాలకు అధ్యక్షత వహించనున్నారు. ఈ నేపథ్యంలో జపాన్ అధ్యక్షుడిపై ఈ దాడి జరగడం కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఏప్రిల్ 23న జపాన్లో దేశ వ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్లోని ఓ దిగువ సభ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది. ఈ నేపథ్యంలోనే తన పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థికి మద్ధతుగా కిషిద ప్రచారం చేయడానికి వచ్చారు. అంతలోనే స్మోకింగ్ బాంబు పేలింది.
'ప్రజల మధ్యలో నుంచి ఏదో గాల్లో ఎగురుకుంటూ వచ్చింది. అకస్మాత్తుగా భారీ శబ్ధంలో అతి పేలింది. వెంటనే నేను నా చిన్నారిని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాను' అని స్థానిక మహిళ ఒకరు తెలిపారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్య..
2022 జులై 8న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే(67) హత్యకు గురయ్యారు. పార్లమెంట్ ఎగువ సభకు ఎన్నికలు జరగనున్న సమయంలో.. నరా అనే ప్రాంతంలోని అబే ప్రసంగిస్తుండగా ఆయనపై దాడి జరిగింది. వెనుక నుంచి వచ్చిన ఓ దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అబే ఒక్కసారిగా ఛాతీపై చేయి పెట్టుకొని కుప్పకూలిపోయారు. తీవ్ర రక్తస్రావమైంది. ఎలాంటి కదలికలు లేని ఆయనను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అబే శ్వాస తీసుకోవడం లేదని, గుండె కూడా చలనం లేదని తెలిసింది. ఆయన కార్డియో పల్మనరీ అరెస్టు పరిస్థితిలో ఉన్నారని టోక్యో మాజీ గవర్నర్ కాసేపటికి వెల్లడించారు. అనేక గంటల తర్వాత.. అబే మరణించారన్న వార్తను అక్కడి మీడియా ధ్రువీకరించింది.ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.