పడగ విప్పుతున్న జపాన్.. అణ్వస్త్రాలను సమకూర్చుకొంటుంది అందుకేనా! - second world war
అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు.. అన్నట్లు.. యుద్ధం, పోరు అనే పదాల్నే తన నిఘంటువులో నిషేధించి, శాంతికాముక రాజ్యాంగాన్ని రాసుకున్న దేశం ఆయుధ వేట మొదలెడితే ఏమనాలి? ఆ పరిస్థితిని ఎలా అంచనా వేయాలి? ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన జపాన్ తాజా నిర్ణయాలు ఇప్పుడందరిలోనూ ఇవే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.
సైనిక శక్తిని పెంచుకొంటున్న జపాన్
By
Published : Dec 18, 2022, 7:50 AM IST
ప్రపంచంలో అణుబాంబు బారిన పడ్డ ఏకైక దేశం జపాన్! రెండో ప్రపంచ యుద్ధంలో ఒకదశలో.. ఆంగ్లేయులను గడగడలాడించిన జపాన్.. హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులతో అతలాకుతలమైంది. అమెరికా ఒత్తిడో మరోటో.. కారణం ఏదైనా తెల్లజెండా ఎగరేసింది. మరికమీదట ఎన్నడూ యుద్ధం చేయబోమని ప్రకటించింది. సొంత సైన్యాన్నీ వద్దనుకుంది. ఆత్మరక్షణను పూర్తిగా అమెరికా చేతుల్లో పెట్టింది. శాంతియుత దేశంగా రాజ్యాంగాన్ని సైతం మార్చుకుంది. ప్రపంచమంతా ప్రచ్ఛన్నయుద్ధంలో ఏదోరూపంలో పాల్గొన్నా, చిన్నా చితక దేశాలు సైతం సరిహద్దుల్లో గిల్లికజ్జాలతో యుద్ధాలకు దిగుతున్నా జపాన్ మాత్రం ఆయుధం పట్టను.. యుద్ధం చేయను అనే సూత్రాన్ని అనుసరిస్తూ వస్తోంది!
కానీ.. 70 ఏళ్ల తర్వాత తాజాగా జపాన్ తెల్లజెండాను కిందికి దించాలని నిర్ణయానికి వచ్చింది. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించి.. ఆత్మరక్షణార్థం సైన్యాన్ని బలోపేతం చేసుకోవాలని, ఆయుధాలను సమకూర్చుకోవాలని నిర్ణయించింది. దీర్ఘశ్రేణి క్షిపణులకు భారీస్థాయిలో సమాయత్తం అవుతోంది. రక్షణ బడ్జెట్‌ను రెట్టింపు చేసింది. దేశ జీడీపీలో 2శాతం రక్షణకు కేటాయించి, వచ్చే ఐదేళ్లలో 300 బిలియన్ డాలర్లు ఇందుకోసం ఖర్చు చేయనున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని క్షిపణులు, హైపర్‌సోనిక్ ఆయుధాలను అమెరికా, బ్రిటన్‌ల నుంచి కొనుగోలు చేసి.. మరికొన్నింటిని సొంతంగా తయారు చేసుకోవాలనుకుంటోంది. దాదాపు 1250 కిలోమీటర్ల దూరం లక్ష్యాలను ఛేదించే 500 క్రూయిజ్ క్షిపణులను జపాన్ సమకూర్చుకోవాలనుకుంటోంది. ఈ మేరకు తమ పరిశ్రమలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది కూడా. దేశవ్యాప్తంగా 70 ఆయుధకేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఐదేళ్లలో వీటి సంఖ్యను 130కి పెంచుతారు.
ఎందుకిదంతా? ఇన్నాళ్లూ శాంతిమంత్రం జపించిన జపాన్ ఉన్నట్టుండి ఎందుకిలా సైనిక పడగ విప్పుతోందంటే.. సరిహద్దుల నుంచి పెరుగుతున్న యుద్ధతాకిడేననే సమాధానం వస్తోంది. ఇరుగు పొరుగునున్న చైనా, రష్యా, ఉత్తర కొరియాల నుంచి కవ్వింపులు పెరిగిన నేపథ్యంలో జపాన్ తాజా నిర్ణయం తీసుకుంది. ఉత్తర కొరియా ఈ మధ్యకాలంలో అణ్వస్త్రాలను సమకూర్చుకోవటమేగాకుండా పదేపదే క్షిపణులను ప్రయోగిస్తోంది. ఇటీవల కొన్ని క్షిపణులు జపాన్ స్వాధీనంలోని దీవుల్లో పడ్డాయి. మరోవైపు తైవాన్ విషయంలో చైనా దూకుడు కూడా తమ భద్రతకు ముప్పు అని జపాన్ భావిస్తోంది. అందుకే సుదూరంలో ఉన్న అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా, శాంతిమంత్రానికే కట్టుబడకుండా భద్రతకు పెద్దపీట వేయాలని జపాన్ ప్రధాని కిషిదా సారథ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది. 'అమెరికాతో సంబంధాలు కొనసాగిస్తూనే ఆత్మరక్షణను బలోపేతం చేసుకోవటం జపాన్‌కు అత్యంత అవసరం. ఎందుకంటే అమెరికా ఇబ్బందులు అమెరికాకున్నాయి. అన్నింటికీ వారిపైనే ఆధారపడితే సాగదు' అని జపాన్ రిటైర్డ్ వాయుసేనాధిపతి ఇవసాకి వ్యాఖ్యానించారు.
సైన్యంగాని సైన్యం.. రెండో ప్రపంచయుద్ధంలో ఓటమి అనంతరం జపాన్ రక్షణ బాధ్యతను అమెరికా తీసుకుంది. జపాన్‌లో 109 చోట్ల అమెరికా దళాలు ఇప్పటికీ మోహరించి ఉన్నాయి. అలాగని జపాన్‌కు అసలు సైన్యమే లేదని అనలేం. 1952 తర్వాత సైన్యాన్ని క్రమంగా తయారు చేసుకుంటూ వస్తోంది. వాయు, పదాతి, నౌకా దళాల్లో సుమారు 2 లక్షల మంది దాకా ఉంటారు. కానీ దీన్ని సైన్యం అనకుండా జపాన్ ఆత్మరక్షణ దళంగా పిలుస్తారు. అంటే వీరు యుద్ధానికి కాకుండా సాయం చేయటానికి మాత్రమే. అమెరికా సైనికులతో కలసి ఈ ఆత్మరక్షణ దళాలు సంయుక్త విన్యాసాలు జరుపుతుంటాయి. మొత్తానికి జపాన్ సైతం ఆయుధవేటలోకి దిగటంతో ఆసియాలో భౌగోళిక రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
అమెరికా మద్దతు.. అమెరికా కూడా వ్యూహాత్మకంగా జపాన్ సైన్యం బలోపేతానికి మద్దతిస్తోంది. చైనాను నిలువ రించటానికి జపాన్ బలోపేతం కావాలని భావిస్తోంది. ఇన్నాళ్లూ జపాన్ ప్రజలు రక్షణ బడ్జెట్ పెంచటానికి ఇష్టపడేవారు కాదు. కానీ తాజా సర్వేల్లో 70శాతానికి పైగా ప్రజలు అందుకు మొగ్గు చూపుతుండటం గమనార్హం. అణ్వస్త్రాలు జపాన్ వద్ద ఇప్పటికిప్పుడు లేకున్నా.. వాటిని తయారు చేసే సామర్థ్యం ఉందని అంటుంటారు. కావాలనుకుంటే జపాన్ స్వల్పకాలంలోనే అణ్వస్త్ర తయారీ చేయగలుగుతుందనేది నిపుణుల భావన.