Japan Earthquake Today : జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. సోమవారం మధ్యాహ్నం ఇషికావా రాష్ట్రంలోని నోటో ప్రాంతంలో వరుసగా భూప్రకంపనలు వచ్చాయి. 3.4 తీవ్రతతో మొదలైన ప్రకంపనలు ఒక దశలో తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.6గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఐదు గంటల వ్యవధిలో మొత్తం 50సార్లు భూప్రకంపనలు వచ్చాయి. తీర ప్రాంత రాష్ట్రాలైన ఇషికావా, నీగట, తొయామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం సూచించింది.
నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
భూకంపం కారణంగా చాలా చోట్ల రహదారులు, భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ప్రజలు భయంతో రహదారులపైకి పరుగులు తీశారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకొన్నట్లు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందింది. భూ ప్రకంపనలతో రహదారులపై ఉన్న కార్లు ఊగిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. 32వేలకుపైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచింది.
భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసిన అధికారులు ప్రజలంతా ఎత్తయిన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఇషికావాకు చెందిన వాజిమా నగర తీరాన్ని ఒక మీటర్ కంటే ఎక్కువ ఎత్తులో అలలు తాకినట్లు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. జపాన్ తీరం వెంబడి భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకర అలలు వచ్చే అవకాశం ఉందని, హవాయికి చెందిన సునామీ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. అవి ఐదు మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది. నిగటా తీరంలో మూడు మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడినట్లు తెలిపింది. భారీ భూ ప్రకంపనలతో అణు కేంద్రాలపై ఏదైనా ప్రభావం ఉందా అనేది తనిఖీ చేస్తున్నామని హొకురికు ఎలక్ట్రిక్ పవర్ సంస్థ వెల్లడించింది. భూకంపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి.
అప్రమత్తమైన ఉత్తర కొరియా, రష్యా
ఉత్తర కొరియా, రష్యాలోనూ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించింది. రెండు దేశాల పరిధిలోనూ చాలాచోట్ల సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రష్యాలోని సకాలిన్ పశ్చిమ ప్రాంతంపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. దక్షిణ కొరియాలోనూ తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది.