గత మూడు దశాబ్దాలుగా జపాన్లో జనాభా భారీగా తగ్గిపోతోంది. గతేడాది జపాన్లో జననాల రేటు ఆల్ టైమ్ కనిష్ఠానికి పడిపోయాయి. మొదటిసారిగా 800,000 కంటే తక్కువ జననాలు నమోదయ్యాయి. అది అక్కడ మరణాల్లో దాదాపు సగం శాతం. మరికొన్నేళ్లు జపాన్లో ఇదే పరిస్థితి కొనసాగితే.. తన ఉనికితో పాటుగా, జపాన్ అదృశ్యమవుతుందని ఆ దేశ ప్రధానమంత్రి సలహాదారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ దేశంలో ఉన్న ఓ చిన్న నగరంలో మాత్రం పరిస్థితులు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. దేశంలోని జననాల రేటుతో పోల్చితే ఈ పట్టణంలో జననాల రేటు రెండింతలు ఎక్కువగా ఉంది. దీనికి ఈ పట్టణ ప్రజలు అనుసరిస్తున్న విధానాలే కారణమని తెలుస్తోంది.
గత కొన్నేళ్లుగా జననాల రేటు పెంచేందుకు జపాన్ ప్రభుత్వం రకరకాల విధానాలను అవలంబిస్తున్నా పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. అయితే 'నాగీ' అనే ఓ చిన్న పట్టణం మాత్రం తమ జనాభాను అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. దాదాపు 6,000 మంది జనాభా కలిగిన ఈ ప్రాంతంలో.. దేశంలో కంటే రెండు రెట్లు అధిక జననాల రేటు నమోదవుతోంది. ఇక్కడ ఏ ఇంట్లో చూసినా ఇద్దరుముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు కనిపిస్తారు. దీంతో ఈ పట్టణం దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. దేశ నలుమూల నుంచే కాకుండా విదేశీ పర్యటకులను కూడా ఈ నాగీ పట్టణం విపరీతంగా ఆకర్షిస్తోంది. తమ కుటుంబాలను చూడడానికి వచ్చే పర్యాటకుల వద్ద నుంచి ప్రత్యేక రుసుం కూడా వసూలు చేస్తుందీ నగరం.
తల్లులు అందరికీ తల్లులే..!
నాగీ ప్రాంతంలో ముగ్గురు లేదా నలుగురు పిల్లలతో ఉన్న కుటుంబాన్ని చూడడం సర్వసాధారణం. తమ కుటుంబ ఆదాయం తక్కువే అయినా సరే.. ఇక్కడి ప్రజలు పిల్లల్ని పెంచడం ఎప్పుడూ భారంగా భావించరు. 'తల్లులు అందరికీ తల్లులే' అనే భావనతో పిల్లలను చూసుకోవడంలో ఇరుగు పొరుగున ఉండే ఇతర తల్లులు, వృద్ధ మహిళలు సహాయం చేస్తుంటారు. వీరికి మన, పర అనే భేదాలు ఉండవు. ఇక్కడి డేకేర్ సెంటర్లు సైతం పిల్లల్ని కనడాన్ని ప్రోత్సహించే విధంగానే ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబంలో అయితే.. వారి మొదటి బిడ్డను చూసుకునే డేకేర్ సెంటర్కు నెలకు 420 డాలర్లను చెల్లిస్తారు. అదే రెండవ బిడ్డ సంరక్షణ కొరకు అయితే అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. మూడో బిడ్డను అయితే కేర్ సెంటర్ వారు ఉచితంగానే సంరక్షిస్తారు. ఇదీ కాకుండా నామమాత్రపు చెల్లింపులతో పిల్లలను చూసుకునేందుకు వృద్ధ మహిళలు కూడా ఉంటారు.
దీంతో పాటుగా ఇక్కడ ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి బిడ్డకు సంవత్సరానికి దాదాపు 1,000 డాలర్లు అందిస్తుంది. ఈ మొత్తాన్ని పిల్లల తల్లిదండ్రులకు ఇస్తారు. 2019లో ఇక్కడ జననాల రేటు 2.95 శాతంగా ఉంది. 2020లో ఈ సంఖ్య కాస్త తగ్గగా.. 2021లో మళ్లీ పుంజుకొని 2.68కు చేరుకుంది. అయితే జపాన్లో మొత్తంలో ఈ జననాల రేటు 1.3 శాతంగా మాత్రమే ఉంది. దక్షిణ కొరియాలో అయితే గతేడాది కేవలం 0.78 శాతంగా ఉంది.