తెలంగాణ

telangana

ETV Bharat / international

జపాన్​లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 10 మంది సైనికులు గల్లంతు!

జపాన్‌లోని ఓ సముద్రంలో గల్లంతైన సైనిక హెలికాప్టర్‌ కూలిపోయినట్లు ఆ దేశరక్షణశాఖ స్పష్టం చేసింది. గురువారం రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం వల్ల రంగంలోకి దిగి గాలింపు చేపట్టగా.. హెలికాప్టర్ శకలాలు లభ్యమయ్యాయి. అయితే అందులోని 10 మంది సిబ్బంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని అధికారులు శుక్రవారం తెలిపారు. చైనాను కట్టడి చేసేందుకు కొంతకాలంగా నైరుతి ప్రాంతంలో.. సైనిక వ్యవస్థను బలోపేతం చేస్తున్న జపాన్‌ సైనిక హెలికాఫ్టర్‌ కూలిపోవడం చర్చనీయాంశమైంది.

Japan Army Helicopter Crashed Several Missed
జపాన్​లో కూలిన ఆర్మీ హెలికాప్టర్​ 10 మంది గల్లంతు

By

Published : Apr 7, 2023, 12:35 PM IST

Updated : Apr 7, 2023, 1:41 PM IST

జపాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జపాన్‌ దక్షిణ దీవుల్లో నిఘా ఆపరేషన్ కోసం వెళ్లిన సైనిక హెలికాఫ్టర్‌ సముద్రంలో కుప్పకూలినట్లు ఆ దేశ రక్షణ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒకినావా ద్వీపం దగ్గర్లో ఉన్న మియాకోజిమా సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు రక్షణశాఖ మంత్రి యసుకాజు హమదా స్పష్టం చేశారు. ఘటన సమయంలో హెలికాఫ్టర్‌లో 10 మంది సైనికులు ప్రయాణిస్తున్నారని చెప్పారు. గల్లంతయిన సిబ్బంది కోసం వెతుకుతున్నామని అయినా ఇంకా ఆచూకీ తెలియరాలేదని పేర్కొన్నారు. తప్పిపోయిన వీరిని ప్రాణాలతో కాపాడేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

టోక్యోకు నైరుతి దిశలో దాదాపు 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో హెలికాఫ్టర్‌ శకలాలను గుర్తించినట్లు జపాన్ రక్షణమంత్రి యసుకాజు హమదా తెలిపారు. వారికోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. కూలిన హెలికాప్టర్‌కు సంబంధించిన ఒక లైఫ్‌ బోటు దొరికినట్లు అధికారులు పేర్కొన్నారు. లభించిన ఈ బోటు​ కోస్ట్ గార్డ్ పెట్రోలింగ్ షిప్‌లు ఉపయోగించని లైఫ్‌బోట్‌ అని అన్నారు. దీనిపై ఉన్న సీరియల్ నంబర్ తప్పిపోయిన హెలికాప్టర్​కు సంబంధించిన సంఖ్య సరిపోయిందని వివరించారు. దీంతో పాటు ఘటనా స్థలిలో ఇదే హెలికాప్టర్​కు చెందిన ఒక తలుపును కూడా కనుగొన్నారు ఆర్మీ అధికారులు. గల్లంతయిన 10 మంది ఆర్మీ జవాన్లలో ఒకరు డివిజన్ కమాండరైన యుయిచి సకామోటో అని తెలిపారు.

ప్రమాదానికి గురయిన UH-60JA బ్లాక్​హాక్ హెలికాప్టర్ గురువారం మధ్యాహ్నం జపాన్‌లోని దక్షిణ దీవులలో చూస్తుండగానే అదృశ్యమైందని గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అధిపతి యసునోరి మోరిషితా తెలిపారు. మియాకో ద్వీపంలోని సైనిక స్థావరం నుంచి బయలుదేరి గాల్లోకి ఎగిరిన పది నిమిషాలకే హెలికాప్టర్​ రాడార్‌తో సంబంధాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు. వాయువ్య దిశలో మియాకో సమీపంలోని ఇరాబు ద్వీపం మధ్య నీటిలో హెలికాప్టర్​ క్రాష్​ జరిగినట్లు అధికారులు గుర్తించారు. మొత్తంగా ఈ ప్రమాదాన్ని జపాన్​ రక్షణ శాఖ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం.

జపాన్‌లోని దక్షిణ ప్రధాన ద్వీపం అయిన క్యుషులో ఉన్న కుమామోటో ప్రిఫెక్చర్‌లోని కీలక ఆర్మీ బేస్‌లో ప్రమాదానికి గురయిన హెలికాప్టర్‌ను ఉంచినట్లు మోరిషితా గురువారం రాత్రి తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్‌కు గతనెల చివర్లో సాధారణ భద్రతా తనిఖీలు చేశారని.. ఎలాంటి సమస్యలు తలెత్తలేదని పేర్కొన్నారు. జపాన్​లోని నైరుతి ద్వీపాలలో తైవాన్​తో సహా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇటీవల సైనిక దాడులు ఎక్కువయ్యాయి. వీటిని తిప్పి కొట్టేందుకు జపాన్​ రక్షణ శాఖ తన సామర్థ్యాన్ని దూకుడుగా పెంచుకుంటూపోతోంది. ఇందులో భాగంగానే చైనాను కట్టడి చేసేందుకు కొంతకాలంగా నైరుతి ప్రాంతంలో జపాన్‌ తన సైనిక వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలో జపాన్‌ సైనిక హెలికాఫ్టర్‌ కూలిపోవడం చర్చనీయాంశమైంది.

Last Updated : Apr 7, 2023, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details