James Cleverly Wife Drugs :వివాదాస్పద వ్యాఖ్యలతో బ్రిటన్ హోంమంత్రి జేమ్స్ క్లెవర్లీ ఆ దేశంలో మహిళా సంఘాల ఆగ్రహం ఎదుర్కొంటున్నారు. తన భార్యకు ప్రతి రాత్రి డేట్ రేప్ డ్రగ్ ఇచ్చేవాడినని ఓ పార్టీలో వ్యాఖ్యానించి సంచలనంగా మారారు. దీర్ఘకాల వైవాహిక బంధానికి అదే రహస్యమంటూ ఆయన చెప్పినట్లు అక్కడి వార్తా పత్రికలు పేర్కొన్నాయి. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండగా క్లెవర్లీ స్పందించారు. అది కేవలం జోక్ అని చెప్పుకొచ్చారు. అలాంటి డ్రగ్‌ను చట్టవిరుద్ధంగా మార్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
ప్రధానమంత్రి రిషి సునాక్ నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో డిసెంబర్ 18న జరిగిన ఓ కార్యక్రమంలో మహిళలతో మాట్లాడుతూ జేమ్స్ క్లెవర్లీ ఆ వ్యాఖ్యలు చేసినట్లు సండే మిర్రర్ న్యూస్ పేపర్ తెలిపింది. 'భార్య రోజూ కాస్త మత్తులో ఉండటమే దీర్ఘకాల వైవాహిక బంధానికి రహస్యం. ఎందుకంటే ఇంకా మంచి వ్యక్తులు బయట ఉన్న విషయాన్ని వారు గుర్తించలేరు. డేట్ రేప్ డ్రగ్‌గా పిలిచే రోహిప్నాల్ను నేను ఆమె తాగే డ్రింక్‌లో ప్రతి రోజు రాత్రి కలిపేవాడిని. కొద్ది మొత్తంలో కలిపితే అదేం చట్టవిరుద్ధం కాదు' అని క్లెవర్లీ వ్యాఖ్యానించినట్లు సండే మిర్రర్ పేర్కొంది.
'ప్రజలకు తెలియాలనే'
డ్రింక్స్ రిసెప్షన్లో ప్రధానితో పాటు రాజకీయ జర్నలిస్టులు, నాయకులు, మంత్రులు పాల్గొన్నట్లు సండే మిర్రర్ పేర్కొంది. ఇలాంటి ఈవెంట్లలో మాట్లాడే విషయాలు ఆఫ్ ది రికార్డ్ అయినప్పటికీ- సంబంధిత అంశంపై క్లెవర్లీ అభిప్రాయాలు ప్రజలకు తెలియాలని దీనిపై రిపోర్ట్ చేసినట్లు వివరించింది.
'జోక్ చేశా'
అయితే, ఈ వివాదంపై క్లెవర్లీ తన ప్రతినిధి ద్వారా క్షమాపణ కోరారు. తాను కేవలం జోక్ చేశానని చెప్పారు. అలాంటి ఘటనలకు పాల్పడటం నేరమని అన్నారు. డ్రింక్స్‌లో అలాంటి మత్తుపదార్థాలు కలపడాన్ని చట్టవిరుద్ధంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని క్లెవర్లీ చెప్పుకొచ్చారు.