Jaishankar UNGA Speech :ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసకు ప్రతిస్పందనలను నిర్ణయించడానికి రాజకీయ సౌలభ్యాన్ని అనుమతించవద్దని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలను కోరారు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదని పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్ అంశంపై ఇటీవల పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్-ఉల్-హక్ కాకర్ ఐరాసలో చేసిన వ్యాఖ్యలు, కెనడాతో దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో పరోక్షంగా ఆ దేశాలపై ఆయన విమర్శలు గుప్పించారు. 78వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాన్ని ఉద్దేశించి జైశంకర్ మాట్లాడారు. భారత్ 'అమృత్ కాల్'లోకి ప్రవేశించిందని చెప్పిన ఆయన... చంద్రయాన్-3 తో ప్రపంచం భారత్ వైపు చూసిందన్నారు.
"భారత్ 'అమృత్ కాల్'లోకి ప్రవేశించింది. చంద్రయాన్-3 జాబిల్లిపై ల్యాండ్ అయినప్పుడు ప్రపంచం ఏమి జరుగుతుందో అనే గ్లింప్స్ చూసింది. భారత డిజిటల్ సహిత గవర్నెన్స్, డెలివరీ విస్తృత పరిధిలో ఉంది. సౌకర్యాలు, సేవలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు, మా శక్తివంతమైన అంకుర సంస్థలు నిర్మాణంలో ఉన్నాయని నేడు ప్రపంచానికి భారత్ సందేశం పంపుతోంది. టీకాల విషయంలో వర్ణవివక్ష వంటి అన్యాయాలను మళ్లీ అనుమతించకూడదు. వాతావరణ మార్పుల విషయంలో తప్పించుకునే ధోరణి ఉండకూడదు. పేద దేశాల నుంచి ధనిక దేశాలకు ఇంధనం, ఆహారం అందించేందుకు మార్కెట్ శక్తులను ఉపయోగించకూడదు. రాజకీయ సౌలభ్యం ఆధారంగా ఉగ్రవాదం, హింసపై ప్రతిస్పందించడాన్ని అనుమతించకూడదు."
--జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి