Jaishankar Statement On Canada : ఖలిస్థానీ వేర్పాటువాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపణలకు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు ఉంటే చూపించాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ఉదాసీనంగా ఉంటున్న వైఖరే ప్రస్తుతం ప్రధాన సమస్య అని జైశంకర్ చురకలు అంటించారు. ముందుగా దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
Jaishankar Warns Canada :ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశాల కోసం జైశంకర్.. అమెరికాకు వెళ్లారు. భారత విలేకరులతో తాజాగా వాషింగ్టన్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్- కెనడా మధ్య దౌత్యపరంగా నెలకొన్న సమస్యలపై ఆయన మాట్లాడారు. నిజ్జర్ హత్యపై నిర్దిష్టమైన సమాచారం ఇవ్వాలని కెనడాకు హితవు పలికారు జైశంకర్. ఈ అంశంపై ఇరుదేశాలు కలిసి చర్చించాలని, తద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. "నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందన్నది కెనడా ఆరోపణ. ఇందుకు సంబంధించి కెనడా దగ్గర కచ్చితమైన సమాచారం ఉంటే.. దాన్ని పరిశీలించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. భారత్ తలుపులు మూసుకొని కూర్చోలేదు. కానీ, కెనడా ఆ వివరాలు ఇవ్వాలి కదా." అని జైశంకర్ పేర్కొన్నారు.
వారి ఉదాసీన వైఖరే..
"చాలా కాలంగా కెనడా సర్కారుతో భారత్ సమస్యలను ఎదుర్కొంటోంది. అతివాదం, ఉగ్రవాదంపై వారు ఉదాసీనంగా ఉన్నారు. ఇదే ఇక్కడ ప్రధాన సమస్యగా నిలుస్తోంది. రాజకీయ ఒత్తిళ్లు, ఇతర కారణాలతో కెనడా అలా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. భారత్లో నేరాలకు పాల్పడినవారు ఇప్పుడు కెనడాలో ఉన్నారు. వారిని తమకు అప్పగించాలని ఎన్నోసార్లు అభ్యర్థించాం. కానీ, కెనడా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కెనడాలో భారత వ్యతిరేక శక్తులు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నది రహస్యం ఏమీ కాదు" అని జైశంకర్ వ్యాఖ్యానించారు.
'మాకు హితబోధ అవసరం లేదు'
కెనడాలో భారత దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగిన విషయాన్ని జైశంకర్ గుర్తు చేశారు. చంపేస్తామని బెదిరింపులు సైతం వస్తున్నాయని అన్నారు. దీన్ని సాధారణ పరిస్థితిగా ఎలా పరిగణిస్తామని ప్రశ్నించారు. మరో దేశానికి అచ్చం ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వారు ఎలా స్పందిస్తారని నిలదీశారు. వాక్ స్వేచ్ఛ పేరుతో దౌత్యవేత్తలపై బెదిరింపులు ఎంతమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. భావప్రకటనా స్వేచ్ఛ గురించి భారత్కు ఇతరులు హితబోధ చేయాల్సిన అవసరం లేదని కుండబద్ధలు కొట్టారు. స్వేచ్ఛ పేరుతో హింసకు పాల్పడటం అంటే.. దాన్ని దుర్వినియోగం చేసినట్లేనని జైశంకర్ గట్టిగా చెప్పారు.
Canada Nazi Ukraine : క్షమాపణలు చెప్పిన కెనడా ప్రధాని ట్రూడో.. అది చాలా పెద్ద తప్పిదం అంటూ..