Jaishankar On Russian Oil Imports : రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ తన కొనుగోలు విధానాల ద్వారా చమురు, గ్యాస్ ధరలు పెరగకుండా అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించిందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం బ్రిటన్‌లో పర్యటిస్తున్న జైశంకర్.. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చమురు ధరలు కట్టడి చేసినందుకు మిగిలిన దేశాలు భారత్‌కు కృతజ్ఞతలు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.
Jaishankar On Buying Russian Oil : "భారత్ కొనుగోలు విధానాల ద్వారా అంతర్జాతీయ చమురు, ఇంధన మార్కెట్లు ధర ఒడుదొడుకులకు గురికాకుండా చేసింది. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా చూసేందుకు ఆ విధానాలు బాగా ఉపయోగపడ్డాయి. అందుకు భారత్‌కు ప్రపంచ దేశాలన్నీ కృతజ్ఞతలు చెప్పాలి. దాని కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుంటే.. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు విక్రేతల వద్దకే మేము కూడా వెళ్లాల్సి వచ్చేది. అప్పుడు చమురు ధరలు మనం ఊహించనంతగా పెరిగేవి. ఫలితంగా అదే ధరలకు ఐరోపా కూడా చమురు కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో ఎల్‌పీజీ మార్కెట్లలో ఆసియాకు రావాల్సిన పెద్ద సరఫరాదారులు ఐరోపాకు తరలిపోయారు. కొన్ని చిన్న దేశాలు ఎల్‌పీజీ ఇంధన కొనుగోలు కోసం దాఖలు చేసిన టెండర్లపై స్పందించేందుకు కూడా సరఫరాదారులు ఆసక్తి చూపలేదు. అదే సమయంలో రష్యాతో భారత్ తమ బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించింది" అని జైశంకర్ వ్యాఖ్యానించారు.