తెలంగాణ

telangana

ETV Bharat / international

రిషి సునాక్​కు 'కోహ్లీ బ్యాట్' గిఫ్ట్- మోదీ తరఫున దీపావళి విషెస్​ చెప్పిన జైశంకర్

Jai Shankar Meets Rishi Sunak : అధికారిక పర్యటన నిమిత్తం బ్రిటన్​కు వెళ్లిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్‌ను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున సునాక్​కు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Jai Shankar Meets Rishi Sunak
Jai Shankar Meets Rishi Sunak

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 9:04 AM IST

Updated : Nov 13, 2023, 9:21 AM IST

Jai Shankar Meets Rishi Sunak : బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్​తో భేటీ అయ్యారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్​. అధికారిక పర్యటన కోసం యూకేకు వెళ్లిన ఆయన.. కుటుంబ సమేతంగా సునాక్​ను కలిశారు. తన భార్య క్యోకోతో కలిసి ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్‌ స్ట్రీట్‌కు చేరుకున్న ఆయన.. రిషి సునాక్‌, అక్షత మూర్తి దంపతులకు ప్రధాని మోదీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గణపతి విగ్రహంతో పాటు భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను రిషి సునాక్‌కు జైశంకర్ అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలను యూకే ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఇద్దరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పినట్లు పేర్కొంది.

మరోవైపు, తనకు ఆతిథ్యం ఇచ్చిన రిషి సునాక్‌ దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ జైశంకర్‌ కూడా ట్విట్టర్​లో పోస్ట్‌ పెట్టారు. భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని విదేశాంగ మంత్రి పునరుద్ఘాటించారు. భారత్‌లో ఇప్పుడు సమర్థ నాయకత్వం ఉందని అన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా బ్రిటన్‌లో ఉన్న జైశంకర్... లండన్‌లోని శ్రీ స్వామినారాయణ మందిర్‌లో ప్రార్థనలు చేసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సతీ సమేతంగా జైశంకర్‌ అభిషేక పూజలో పాల్గొన్నారు. సోమవారం లార్డ్స్ క్రికెట్​ మైదానంలో భారత హైకమిషనర్​ నిర్వహించే దీపావళి వేడుకలకు హాజరుకానున్నారు.

15 వరకు యూకేలో పర్యటన
యూకేలో జైశంకర్‌ పర్యటన నవంబర్‌ 15 వరకు కొనసాగనుంది. ఆ దేశ విదేశాంగ శాఖ సెక్రటరీ జేమ్స్‌ క్లెవర్లీతోపాటు పలువురు అధికారులతో ఆయన సమావేశమై భారత్‌-యూకే ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇప్పటికే, భారత్​, బ్రిటన్​ మధ్య సులభతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఆగస్టు 8-31 మధ్య 12వ విడత చర్చలు జరిగాయి. ఇదే అంశంపై నవంబర్​ 3న భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్​లో మాట్లాడారు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్​. దీంతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్​లో టీమ్​ఇండియా ప్రదర్శనపై శుభాకాంక్షలు తెలిపారు.

Rishi Sunak Visits Akshardham Temple : అక్షర్​ధామ్ ఆలయంలో సునాక్​ దంపతుల పూజలు.. హరిత నిధికి 2 బిలియన్ డాలర్ల విరాళం

'ప్రధాని అత్తగారినంటే.. ఎవరూ నమ్మలేదు'.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన సుధామూర్తి

Last Updated : Nov 13, 2023, 9:21 AM IST

ABOUT THE AUTHOR

...view details