Jahnavi Kandula Seattle Police Officer :అమెరికా సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అమెరికాను భారత్ ఇప్పటికే డిమాండ్ చేసింది. అయితే చులకనగా మాట్లాడిన పోలీసు డేనియల్ ఆర్డరర్‌కు సియాటెల్ పోలీసు విభాగం మద్దతుగా నిలిచింది. వివాదంపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్ (Seattle Police Officers Guild) ఓ ప్రకటన విడుదల చేసింది. వైరల్ అయిన దృశ్యాలు బాడీక్యామ్ వీడియో రికార్డ్ చేసినవని.. ఆ సంభాషణల్లో ఒకవైపు మాత్రమే బహిర్గతం అయ్యిందని పోలీసు అధికారుల గిల్డ్ వెల్లడించింది. అందులో ఇంకా చాలా వివరాలున్నాయని, అవి ప్రజలకు తెలియవని.. పూర్తి వివరాలు తెలియకపోవడం వల్లే.. అక్కడ అసలేం జరిగిందో చెప్పడంలో మీడియా విఫలమైందని డేనియల్‌కు (Seattle Police Officer Daniel Auderer) మద్దతుగా గిల్డ్ వ్యాఖ్యానించింది.
Seattle Police Officer Daniel Auderer Letter :ఈ ఘటనపై ఉన్నతాధికారులకు డేనియల్ రాసిన లేఖను కూడా గిల్డ్ విడుదల చేసింది. న్యాయవాదులను ఉద్దేశిస్తూనే.. తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు డేనియల్ తన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు న్యాయస్థానంలో వాదనలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి తాను నవ్వానని లేఖలో పేర్కొన్నారు. బాడీక్యామ్ కెమెరా ఆన్‌లో ఉన్న విషయం తనకు తెలీదని.. తాను జరిపిన వ్యక్తిగత సంభాషణ.. అందులో రికార్డ్ అయ్యిందని (Jaahnavi Kandula Police Officer Video) తెలిపారు. తాను కేవలం న్యాయవాదులు జరిపే వాదనల గురించే మాట్లాడానని.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి.. ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలు ఎలా సాగిస్తారో గతంలో చాలా సార్లు చూశానన్నారు. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నానని డేనియల్ తన లేఖలో పేర్కొన్నారు.