ఇండోనేసియా వేదికగా ఇటీవల జీ-20 సదస్సు జరిగింది. తన ఆరేళ్ల చిన్నారితో కలిసి ఈ సదస్సుకు హాజరు కావడంపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే వాటిని ఆమె తిప్పికొట్టారు. 'నన్ను విమర్శిస్తోన్న వారికి ఒకటే ప్రశ్న. నేను నా కుమార్తెను ఎలా పెంచాలనేది మీకు సంబంధించిన విషయమని అనుకుంటున్నారా? కానే కాదు. తల్లిగా బాధ్యతల విషయంలో నాకు నచ్చినట్లుగా వ్యవహరించే హక్కు ఉంది. చిన్నారికి అమ్మ దూరంగా ఉందనే బాధ తెలియకుండా చేస్తూనే.. ఈ దేశం కోసం పనిచేసే హక్కు కూడా ఉంది' అని కుండబద్దలు కొట్టారు.
మెలోనీ తన కుమార్తెను జీ-20 సదస్సుకు తీసుకెళ్లడాన్ని విమర్శిస్తూ.. స్థానికంగా ఓ వార్తాపత్రికలో కథనం ప్రచురితమైన తర్వాత ఈ వివాదం మొదలైంది. 'కార్మికులు ఎవరూ తమ కుమార్తెలను ఫ్యాక్టరీకి తీసుకెళ్లరు. ఒకవైపు తన బిడ్డకు కూడికలు, తీసివేతలు చెబుతూనే.. మరోవైపు చైనాతో చర్చలు జరపడంలో మెలోనీకి ఎలాంటి సమస్యలు ఎదురుకావేమో! ఆమె స్థానంలో నేనుంటే.. బాలిలో పెద్దలతోనే కలిసి పర్యటిస్తా. 'ఏమైనా ఉంటే మీ నాన్నను అడుగు. నేను త్వరలోనే తిరిగొస్తా' అని కుమార్తెకు చెబుతా' అని అందులో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. ఈ తరహా విమర్శలపై మెలోనీ తాజాగా గట్టిగా స్పందించారు.