కరోనా మహమ్మారి, మంకీపాక్స్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోన్న సమయంలో.. వైద్య సిబ్బంది చేతికి ఒక కీలక కేసు వచ్చింది. ఇటలీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తికి ఒకే సమయంలో కరోనావైరస్, మంకీపాక్స్,హెచ్‌ఐవీ సోకినట్లు గుర్తించారు. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్‌లో ప్రచురితమైన వార్త ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 19న ఈ కేసు గురించి దానిలో ప్రచురితమైంది.
ఇటలీకి చెందిన సదరు బాధితుడు ఐదురోజుల పాటు స్పెయిన్ పర్యటనకు వెళ్లారు. వెళ్లొచ్చిన తొమ్మిది రోజులకు ఆ వ్యక్తికి జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, తొడ దగ్గర ప్రాంతంలో వాపు కనిపించాయి. ఆ లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం దద్దుర్లు, పొక్కులు రావడం ప్రారంభమైంది. దాంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా.. వైద్యులు అతడిని అంటువ్యాధుల చికిత్సా విభాగానికి తరలించారు. కాలేయం, ప్లీహం మీద పడిన ప్రభావాన్ని గుర్తించారు. అతడిని పరీక్షించగా.. మంకీపాక్స్ సోకినట్లు తెలిసింది. అలాగే హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది. జీనోమ్ సీక్వెన్స్‌లో అతడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.5.1 బారినపడినట్లు వెల్లడైందని ఆ నివేదిక పేర్కొంది. ఇక ఆ వ్యక్తి కరోనా టీకా రెండుడోసులు వేయించుకున్నారు.