ఇటలీలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. అయోనియన్ సముద్రంలో పడవ మునిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బోటులో 100 మంది వలసదారులు ఉన్నట్లు పేర్కొన్నారు. కోస్టు గార్డు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాలాబ్రియాలోని తీరప్రాంత పట్టణం క్రోటోన్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగిందీ ప్రమాదం.
బోటు ప్రమాదంలో దాదాపు 40 మంది ప్రయాణికులు బయటపడినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నామని వెల్లడించారు. మృతుల్లో నెలల చిన్నారి కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. కోస్టు గార్డ్, బార్డర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి చెందిన నౌకలు సహాయక చర్యలలో పాల్గొన్నాయని తెలిపారు. పడవపై వలస వచ్చిన వారు ఏ దేశస్థులో ఇంకా తెలియలేదని అన్నారు. పడవ ఎక్కడ నుంచి వచ్చిందో కూడా ఇంకా తెలియలేదని చెప్పారు.