Elon Musk Trump Twitter: టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విటర్ కొనుగోలు ఒప్పందంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు.. ట్రంప్ ఇంకా రాజకీయాల్లో కొనసాగడంపై మస్క్ తాజాగా చేసిన కామెంట్స్ చూస్తే ఇది స్పష్టమవుతోంది. ట్రంప్ ఇక క్రియాశీల రాజకీయాలకు స్వస్తి పలికి శేష జీవితాన్ని హాయిగా గడపాలని మస్క్ సూచించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అధ్యక్షుడు బైడెన్ పదవీకాలం ముగిసేనాటికి ట్రంప్ వయస్సు 82 ఏళ్లవుతుందని మస్క్ మంగళవారం చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికా సహా దేనికైనా సీఈఓగా వ్యవహరించడానికి ఆ వయసు చాలా ఎక్కువని వ్యాఖ్యానించారు. ట్రంప్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. కానీ, రాజకీయాలకు స్వస్తి పలికి హాయిగా గడపాలని "hang up his hat & sail into the sunset" అనే ఆంగ్ల జాతీయం ద్వారా పరోక్షంగా సూచించారు. డెమోక్రటిక్ పార్టీవారు సైతం ట్రంప్‌పై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. అధ్యక్ష పదవిని చేపట్టడం తప్ప ట్రంప్‌కు మరో మార్గం లేదన్న భావన ఆయనలో కలిగించొద్దన్నారు.
ఇలా ట్రంప్ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని మస్క్ బహిరంగంగా సూచించడం ఇదే తొలిసారి. గత నెల ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను ఎవరికి మద్దతు ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నానన్నారు. ప్రస్తుతం కాలిఫోర్నియా గవర్నర్‌గా ఉన్న డీశాంటిస్ అయితే బైడెన్‌పై సునాయాసంగా విజయం సాధిస్తారని అభిప్రాయపడ్డారు. ఆయన ప్రచారం కూడా చేయాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు.