Isro Chandrayaan 3 Wishes :చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారిగా అడుగుపెట్టిన భారత్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రయాన్ 3 విజయం పట్ల భారత సంతతి ప్రజలతో పాటు యావత్ ప్రపంచం సంతోషం వ్యక్తం చేస్తోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాతో పాటు యూరోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థలు ఇస్రోకు అభినందనలు తెలిపాయి.
ఇస్రోకు స్పేస్ ఏజెన్సీల అభినందనలు
చంద్రయాన్ 3 విజయం కావడం వల్ల ఇస్రో బృందాన్ని అభినందించారు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్. జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ విజయవంతమైనందుకు అభినందనలు చెప్పారు. సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా నిలిచిన భారత్‌ను ప్రశంసించారు. చంద్రయాన్-3లో భాగస్వామ్యమైనందుకు సంతోషంగా ఉందన్నారు బిల్ నెల్సన్. మరోవైపు చంద్రయాన్ 3 విజయం పట్ల బ్రిటన్ అంతరిక్ష పరిశోధన సంస్థ సైతం అభినందనలు తెలిపింది.
మోదీ, ఇస్రోకు పుతిన్ అభినందనలు
Putin Wishes Modi :చంద్రయాన్ 3విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ సందేశం పంపించారు. అంతరిక్ష పరిశోధనలో ఈ విజయం కీలక ముందడుగుగా అభివర్ణించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు.