Israeli Palestinian conflict: పాలస్తీనా పశ్చిమ ప్రాంతంలోని జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడిని కవర్ చేసేందుకు వెళ్లిన ఆల్-జజీరా జర్నలిస్ట్‌ను కాల్చి చంపినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. దాడి ప్రారంభమైన కొద్దిసేపటికే అరబిక్ ఛానల్ రిపోర్టర్ షిరీన్ అబు ఆక్లే మృతి చెందినట్లు వెల్లడించింది. జరుసలేంకు చెందిన అల్ క్వాడ్స్ వార్తాపత్రికలో పని చేస్తున్న పాలస్తీనా జర్నలిస్ట్ సైతం గాయపడ్డారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్ చేసిన దాడిలోనే జర్నలిస్టులకు తూటాలు తగిలాయని తెలిపింది. వారు ధరించిన దుస్తులపై స్పష్టంగా ప్రెస్ అని రాసి ఉన్నట్లు పేర్కొంది.
మరోవైపు.. జెనిన్లో ఉన్న తమ బలగాలపై తుటాలు, బాంబులతో విరుచుకుపడ్డారని.. అందుకే తాము ఎదురుదాడి చేసినట్లు పేర్కొంది ఇజ్రాయెల్ మిలిటరీ. జర్నలిస్ట్ మృతిపై దర్యాప్తు చేపడతామని, పాలస్తీనా సైనికుడే వారిపై కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్నామని పేర్కొంది.