Israel vs Palestine War : పశ్చిమాసియాలో రగిలిన యుద్ధ జ్వాల మరణ మృదంగం మోగించింది. అత్యంత పాశవికంగా హమాస్ మిలిటెంట్లు జరిపిన మారణకాండలో మృతుల సంఖ్య 900కు చేరుకోగా.. ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం పాలస్తీనాపై జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 680కు చేరుకుంది. గత కొన్ని దశాబ్దాల్లోనే అత్యంత దారుణమైన ఈ ఘటనలతో రెండు ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇజ్రాయెల్‌లోని సంగీత సంబరమే అతి పెద్ద విషాద వేదికగా మిగిలింది. అక్కడ ఒక్కచోటే 260 మందిని మిలిటెంట్లు హతమార్చారు. 73 మంది సైనికులనూ మిలిటెంట్లు చంపేశారు. మరోవైపు మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య పట్టణాలు, నగరాల్లో ప్రారంభమైన పోరాటం ముగింపు దశకు చేరుకుంది. దాదాపుగా మిలిటెంట్లు అందరినీ ఏరివేశామని సైన్యం ప్రకటించింది. కొన్నిచోట్ల మాత్రం పోరాటం కొనసాగుతోందని పేర్కొంది. మిలిటెంట్లకు కేంద్రంగా నిలిచిన గాజాను ఇజ్రాయెల్ అష్ట దిగ్బంధం చేసింది. విద్యుత్తు, ఆహారం, ఇంధనాన్ని నిలిపేసింది.
Israel Hamas Issue : తమ పట్టణాలు, నగరాల్లోని మిలిటెంట్లతో పోరాటాన్ని కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సైన్యం గాజా సరిహద్దుల్లో ధ్వంసమైన కంచెల వద్ద భద్రతను మళ్లీ కట్టుదిట్టం చేసింది. ప్రధాని ఆదేశాలతో గాజాలోని హమాస్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది. మరోవైపు పాలస్తీనా నుంచి రాకెట్ల వర్షం కురుస్తూనే ఉంది. జెరూసలెం, టెల్ అవీవ్‌లలో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. హమాస్ మిలిటెంట్లపై ప్రతి దాడులను తీవ్రం చేసినట్లు ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి రిచర్డ్ హెచ్ తెలిపారు. గాజా సరిహద్దు వెంబడి ఊహించిన దాని కంటే ఎక్కువ చోట్ల చొరబాట్లు జరిగాయని, వాటిని తిప్పికొట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి హమాస్ వద్ద ఎలాంటి ఆయుధాలు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే గాజాలోని వెయ్యికిపైగా హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు చేసిందని తెలిపారు. బీరీ కిబుట్జ్ ప్రాంతంలో 70 మందికిపైగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారని.. ఐడీఎఫ్ దళాలు వారితో తీవ్రంగా పోరాడుతున్నాయని పేర్కొన్నారు. హమాస్ 4,400 రాకెట్లను ప్రయోగించిందని.. వెయ్యి మంది మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబడ్డారని సైన్యం అంచనా వేసింది. 3లక్షల మంది సైనికులను సరిహద్దుల్లో ఇజ్రాయెల్ మోహరించింది.
Israel Palestine War : 130 మంది ఇజ్రాయెల్ వాసులను బందీలుగా చేసుకున్నట్లు హమాస్ మిలిటెంట్లు ప్రకటించారు. వీరిలో ఇజ్రాయెల్ సైనికులూ ఉన్నారు. విదేశీయులనూ మిలిటెంట్లు అపహరించారు. ఘర్షణ కారణంగా లక్షా 23 వేల మంది గాజావాసులు నిరాశ్రయులయ్యారని ఐరాస వెల్లడించింది. హమాస్‌పై యుద్ధం ప్రకటించిన ఇజ్రాయెల్.. గాజాను పూర్తిగా దిగ్బంధించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గాజాకు వెళ్లే కీలక సరఫరాలను నిలిపేసింది. కనీస అవసరాలపై గాజా మొత్తం ఇజ్రాయెల్‌పైనే ఆధారపడుతోంది. దీంతో గాజాలోని 23లక్షల మంది ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది. గత రెండు రోజులుగా గాజాలోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని పట్టణాలూ అలాగే ఉన్నాయి. ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడుల్లో బందీలుగా ఉన్న నలుగురు సైనికులు మరణించారని హమాస్ ప్రతినిధి తెలిపారు.