తెలంగాణ

telangana

ETV Bharat / international

'దక్షిణ గాజా నుంచి పారిపోండి'- పాలస్తీనీయులకు ఇజ్రాయెల్‌ తాజా హెచ్చరికలు - internet sevices shut off in gaza

Israel Vs Palestine South Gaza : దక్షిణ గాజాలోని పౌరులు తక్షణమే ఆ ప్రాంతం నుంచి తరలిపోవాలని ఇజ్రాయెల్‌ తాజా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గాజావాసులు మళ్లీ వలసబాట పట్టక తప్పేలా కన్పించట్లేదు.

Israel Vs Palestine South Gaza
Israel Vs Palestine South Gaza

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2023, 10:49 AM IST

Updated : Nov 18, 2023, 11:20 AM IST

Israel Vs Palestine South Gaza : హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఉత్తర గాజాలో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ ఇప్పుడు దక్షిణ గాజాపై దృష్టిపెట్టింది. ఈ ప్రాంతంలోని పాలస్తీనీయులు తక్షణమే పశ్చిమ ప్రాంతానికి పారిపోవాలని తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ గాజాపైనా ముమ్మర దాడులకు సిద్ధమైన ఐడీఎఫ్‌.. పౌరులు తరలిపోవాలని ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దక్షిణ గాజాలోని కొన్ని ప్రాంతాలపై ఇజ్రాయెల్‌ దాడి చేసింది.

"ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించాం. ఇది అంత సులభం కాదని మాకు తెలుసు. అయితే, ఎదురుకాల్పుల్లో పౌరులు చిక్కుకోకూడదని మేం భావిస్తున్నాం" అని ఓ ఇజ్రాయెల్‌ అధికారి వెల్లడించారు. దక్షిణ గాజా నగరమైన ఖాన్‌ యూనిస్‌లో 4లక్షల వరకు జనాభా ఉంటారు. దీనికి తోడు.. ఇటీవల ఉత్తర గాజాలో ఇజ్రాయెల్‌ విరుచుకుపడటం వల్ల అనేక మంది దక్షిణ ప్రాంతానికి వలస వచ్చారు. ఇప్పుడు వీరందరినీ పశ్చిమ ప్రాంతానికి తరలి వెళ్లాలని ఇజ్రాయెల్‌ హెచ్చరికలు చేసింది. అక్కడైతే మానవతా సాయం పొందేందుకు సులువుగా ఉంటుందని పేర్కొంది. దీంతో మళ్లీ వలసబాట పట్టక తప్పేలా లేదని పాలస్తీనీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

వలసబాట పట్టిన పాలస్తీనీయులు

ఎలిమెంటరీ స్కూల్‌లో రాకెట్లు, గ్రనేడ్లు.. శనివారం తెల్లవారుజామున ఖాన్‌ యూనిస్‌ నగరంలోని ఓ ప్రాంతంపై ఇజ్రాయెల్‌ బాంబు దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 26 మంది మరణించినట్లు పాలస్తీనా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందులో అత్యధికులు చిన్నారులేనని పేర్కొన్నాయి. మరోవైపు, ఉత్తర గాజాలో అణువణువు తనిఖీలు చేస్తున్న ఐడీఎఫ్‌ దళాలు.. హమాస్‌ స్థావరాలను బట్టబయలు చేస్తున్నాయి. తాజాగా ఓ కిండర్‌గార్డెన్‌, ఎలిమెంటరీ స్కూల్‌లో ఇజ్రాయెల్‌ బలగాలు పెద్ద ఎత్తున ఆయుధాలను గుర్తించాయి. మోర్టార్‌ షెల్స్‌, రాకెట్ ప్రొపెల్ల్‌డ్‌ గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలను హమాస్‌ ఈ స్కూళ్లలో భద్రపర్చినట్లు ఐడీఎఫ్‌ పేర్కొంది. అందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది.

ఇజ్రాయెల్ దాడులు వల్ల గాజా పట్టీలో ఇంధన కొరత ఏర్పాడింది. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. బయటి ప్రపంచంతో గాజాకు సంబంధాలు తెగిపోయాయి. ఇంధన కొరత వల్ల ఇంటర్నెట్, ఫోన్ నెట్‌వర్క్‌లను మూసివేసినట్లు ప్రధాన పాలస్తీనా టెలికాం ప్రొవైడర్ తెలిపింది. కమ్యూనికేషన్ వ్యవస్థను పునరుద్ధరించాలంటే ఇంధనం అవసరమని.. అందుకు అంతర్జాతీయ సంస్థలు ఇజ్రాయెల్‌ను ఒప్పించాలని కోరింది. ఈ యుద్ధం వల్ల గాజాలో ఆహారం దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 11 వేల మందికి పైగా తమ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మరోవైపు హమాస్ దాడుల్లో 12 వందల మంది తమ పౌరులు మరణించారని ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

హమాస్​పై ఇజ్రాయెల్ ఉక్కుపాదం- కీలక నేత ఇల్లు ధ్వంసం, నేవీ ఆయుధాలు సైతం!

అల్‌షిఫా ఆస్పత్రిలోకి ఇజ్రాయెల్ దళాలు- హమాస్ ముష్కరులకు అల్టిమేటం- కమాండ్ సెంటర్ అక్కడే!

Last Updated : Nov 18, 2023, 11:20 AM IST

ABOUT THE AUTHOR

...view details