Israel Vs Palestine Updates : హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడితో అవాక్కయిన ఇజ్రాయెల్.. తిరిగి తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో 232 మందికిపైగా మరణించారు. 1,697 మంది గాయపడ్డారు. మరోవైపు ఇజ్రాయెల్‌లోకి అక్రమ చొరబాటుకు యత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్- ఐడీఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతానికి చెందిన అఫ్కెయిన్ పట్టణంలో.. హమాస్ తీవ్రవాదులు బందీలుగా పట్టుకున్న అనేక మందిని విడిపించినట్లు పేర్కొంది. అయితే ఈ ఊహించని దాడిలో.. తమ బేస్‌లు, కమ్యూనిటీలు ఇంకా తమ నియంత్రణలోకి రాలేదని లెఫ్టినెంట్ కల్నల్ జొనాథన్ కాన్రియస్ చెప్పారు.
Hamas Attack On Israel : అంతకుముందు ఉరుములేని పిడుగులా ఇజ్రాయెల్‌పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ మెరుపు దాడులకు దిగింది. యూదుల సెలవు దినమైన శనివారం తెల్లవారుజామునే వేల రాకెట్లను గాజా నుంచి ప్రయోగించి.. సాయుధులైన డజన్లకొద్దీ మిలిటెంట్లు సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా హమాస్ విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పట్టణాల్లో మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు. డజన్లకొద్దీ ఇజ్రాయెలీలను బందీలుగా చేసుకున్నారు. ఇజ్రాయెల్ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల మిలిటెంట్లకు, ఇజ్రాయెల్ సైన్యానికి భీకర పోరు సాగుతోంది. రెండు పట్టణాల్లో పలువురిని బందీలుగా చేసుకుని పాగా వేశారు. హమాస్ దాడుల్లో 300 మందికి పైగా మరణించారు. 1100 మంది గాయపడ్డారు.
బంకర్లలో తలదాచుకున్నాం..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఇజ్రాయెల్‌లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అక్కడి ప్రభుత్వ సూచనలు పాటించాలని సూచించింది. మరోవైపు అక్కడి పరిస్థితిపై ఓ భారత విద్యార్థిని స్పందించింది. 'మతపరమైన సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ దాడులు అకస్మాత్తుగా జరిగాయి. శనివారం ఉదయం 5.30 గటంల సమయంలో సైరన్లు మోగాయి. అనంతరం ఆ సైరన్లు ఆగిపోయేదాగా దాదాపు 7-8 గంటలు బంకర్లలో ఉన్నాం. దీంతోపాటు ఇళ్లలోనే ఉండమని ఇజ్రాయెల్ భద్రతా దళాలు చెప్పాయి. ఇక్కడ రవాణ సౌకర్యాలు అన్నింటినీ మూసేశారు. మేము ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నాము. ఏదైనా విషయం ఉంటే వారు మాకు అప్డేట్ చేస్తారు' అని ఆ విద్యార్థి చెప్పుకొచ్చింది.
ఇజ్రాయెల్ ప్రధాని మాస్ వార్నింగ్
Israel PM Statement :హమాస్ దాడుల నేపథ్యంలో ఉగ్రదళాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా మాస్ వార్నింగ్ ఇచ్చారు. 'హమాస్ ఉగ్రవాదులు ఉన్న, దాడులు నిర్వహిస్తున్న బేస్‌లు, వారి నగరాన్ని శిథిలాలుగా మారుస్తాం. గాజాలో నివాసితులకు నేను చెప్పేదొక్కటే.. వెంటనే గాజా వదిలి వెళ్లిపోండి. ఎందుకంటే మేము బలవంతంగా పనిచేస్తాము' అని అన్నారు.
#ఇండియా విత్ ఇజ్రాయెల్
ఇజ్రాయెల్‌లో హమాస్ దాడుల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో (ఇంతకముందు ట్విట్టర్) ఇండియా విత్ ఇజ్రాయెల్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీనిపై ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందించింది. తన అధికారికి ఎక్స్ ఖాతాలో భారత్‌కు కృతజ్ఞతలు తెలిపింది. అంతకుముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. హమాస్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయెల్ పౌరుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ క్లిష్టపరిస్థితుల్లో ఇజ్రాయెల్‌తో మేము ఉంటామని చెప్పారు.
ఎమర్జెన్సీ అయితే సంప్రదించండి..
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నేరుగా భారత ప్రతినిధి కార్యాలయాన్ని సంప్రదించాలని పాలస్తీనాలో ఉన్న భారతీయులకు ఆ కార్యాలయం చెప్పింది. 'పాలస్తీనాలో నెలకొన్న భద్రతా పరమైన కారణాల దృష్ట్యా భారతీయ పౌరులకు 24 గంటల ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది. జవ్వాల్ : 0592-916418, వాట్సాప్ : +970-59291641' అని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.