తెలంగాణ

telangana

ETV Bharat / international

హమాస్ చీఫ్ ఇంటిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం- ఖాన్ యూనిస్​లో భీకర దాడులు! - ఇజ్రాయెల్ హమాస్ వివాదం

Israel Surrounds Hamas Chief House : హమాస్‌ కీలక నేతలపై గురి పెట్టిన ఇజ్రాయెల్ తాజాగా ఆ లక్ష్యానికి చేరువైనట్లు ప్రకటించింది. హమాస్ గాజా అధిపతి యాహ్యా సిన్వర్‌ నివాసాన్ని ఐడీఎఫ్ బలగాలు చుట్టు ముట్టాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఖాన్‌ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో జన్మించిన యాహ్యా సిన్వర్‌ హమాస్‌ చేసిన అనేక దాడుల వెనుక మాస్టర్‌ మైండ్‌గా వ్యవహరించినట్లు ఇజ్రాయెల్‌ చెబుతోంది. 2015లో అమెరికా కూడా సిన్వర్‌ను ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది.

Israel Surrounds Hamas Chief House
Israel Surrounds Hamas Chief House

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 2:00 PM IST

Updated : Dec 7, 2023, 2:47 PM IST

Israel Surrounds Hamas Chief House :గాజా పట్టీలో హమాస్‌ను కూకటివేళ్లతో పెకిలించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్ ఆ సంస్థకు చెందిన అగ్రనాయకులను అంతమెుందించాలనే విషయంలో ముందడుగు వేసింది. హమాస్ గాజా అధిపతి యాహ్యా సిన్వర్‌ ఇంటిని చుట్టుముట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. సిన్వర్‌ నివాసాన్ని సమీపించినట్లు ఈనెల 5వ తేదీనే ఐడీఎఫ్ సూచనప్రాయంగా వెల్లడించింది. ఖాన్‌ యూనిస్‌లో భూతల దాడులను ఉద్ధృతం చేసినట్లు వీడియోను కూడా విడుదల చేసింది.

గాజా అధిపతిగా 2017లో నియామకం
ఖాన్‌ యూనిస్‌లోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించిన యాహ్యా సిన్వర్ 2017లో హమాస్‌ గాజా అధిపతిగా ఎన్నికయ్యారు. యాహ్యా సిన్వర్ తన జీవితంలో సగ భాగం ఇజ్రాయెల్‌ జైళ్లలోనే గడిపాడు. 1988లో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికుల అపహరణ, హత్య సహా నలుగురు పాలస్తీనియన్ల హత్యకు పథకం రచించాడనే ఆరోపణలతో జైలు పాలయ్యాడు. సిన్వర్ జైలుకు వెళ్లకముందు ఇజ్రాయెల్‌ నిఘా విభాగానికి సమాచారం చేరవేస్తున్న వారిని శిక్షించే అల్-మజ్ద్ భద్రతా యంత్రాంగానికి అధిపతిగా పనిచేశాడు.

హ‌మాస్ మిలిట‌రీ వింగ్ 2006లో ఇజ్రాయెల్ ఆర్మీ పోస్టుపై దాడి చేసి ఇద్దరు సైనికుల్ని హతమార్చి, గిలాడ్ షాలిట్ అనే ఓ సైనికుడిని అధీనంలోకి తీసుకుంది. గిలాడ్ షాలిట్‌ విడుదల కోసం ఇజ్రాయెల్‌ 2011లో హమాస్‌తో పాలస్తీనా ఖైదీల విడుదల ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ సిన్వర్‌ను విడుదల చేసింది. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్‌ హనియా ఖతార్‌లో ఉండటం వల్ల సిన్వర్ అనతి కాలంలోనే ఆ సంస్థ గాజా అధిపతిగా ఎదిగాడు. 2015లో అమెరికా అత‌డ్ని అంత‌ర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. తాను విచారించిన వ్యక్తుల్లో సిన్వర్ అత్యంత క్రూరమైన వ్యక్తని ఇజ్రాయెల్ అంతర్గత భద్రతా సంస్థ షిన్‌ బెట్‌ మాజీ అధికారి అన్నారు. అతడు ఇజ్రాయెల్‌ సైనికులతో పాటు పాలస్తీనియన్లను అతి కిరాతకంగా హతమార్చినట్లు చెప్పారు. ఆక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి వెనక యాహ్యా సిన్వర్‌ ముఖ్య భూమిక పోషించినట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

Last Updated : Dec 7, 2023, 2:47 PM IST

ABOUT THE AUTHOR

...view details