Israel Strikes Ambulance :గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి వెలుపల అంబులెన్స్‌ల కాన్వాయ్‌పై వైమానిక దాడి జరగడంపై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అంబులెన్స్ కాన్వాయ్‌పై దాడి ఘటనతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. అల్ షిఫా ఆసుపత్రి వద్ద రహదారులపై చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాల చిత్రాలు భయానకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్పత్రులను ఆహారం, నీరు, ఔషధ, ఇంధన కొరతలు తీవ్రంగా వేధిస్తున్నాయని అక్కడి భయంకర మానవతా సంక్షోభాన్ని గుటెర్రెస్ నొక్కిచెప్పారు. ఆస్పత్రుల్లోని శవాగారాలన్నీ మృతదేహాలతో నిండిపోయాయన్నారు. పిల్లలకు రోగాలు, శ్వాసకోశ వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని ఐరాస హెచ్చరించింది. ఇప్పటికైనా బందీలను బేషరతుగా విడిచిపెట్టాలని హమాస్‌కు స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి చీఫ్ వ్యాఖ్యలపై ఐరాసలోని ఇజ్రాయెల్ శాశ్వత ప్రతినిధి ఎర్డాన్ మండిపడ్డారు. గుటెరస్ వాస్తవం తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని వ్యాఖ్యానించారు.
శరణార్థ శిబిరంపై వైమానిక దాడి!
అంతర్జాతీయంగా కాల్పుల విరమణ విషయంలో పలు దేశాల నుంచి ఒత్తిడి ఎదురవుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయటం లేదు. గాజా పట్టీలోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై భీకర దాడులు చేస్తోంది. ప్రధానంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడుతోంది. వీటిని కేంద్రంగా చేసుకొనే హమాస్ కార్యకలాపాలు కొనసాగిస్తోందని ఇజ్రాయెల్ ముందునుంచి చెబుతూ వస్తోంది. ఇటీవల జబాలియా శరణార్థి శిబిరంపై కూడా దాడికి దిగింది ఇజ్రాయెల్. శనివారం మరోసారి ఆ శిబిరంపై వైమానిక దాడి నిర్వహించింది. ఈ ఘటనలో శిబిరంలోని అల్ ఫకూరా పాఠశాలలో తలదాచుకుంటున్న 15 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని.. 54 మంది గాయలపాలయ్యారని పాలస్తీనా రెడ్ క్రిసెంట్ సంస్థ వెల్లడిచింది.
ఇజ్రాయెల్ సైనిక పోస్టులపై రాకెట్లు!
ఆల్-ఖద్ ఆసుపత్రి సమీపంలోనూ ఇజ్రాయెల్ భద్రతా దళాలు బాంబులతో బీభత్సం సృష్టంచాయి. ఈ ఘటనలో 21 మంది గాయపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ ప్రదర్శిస్తోన్న దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు లెబనాన్ నుంచి దాడులు చేసున్న హెజ్‌బొల్లా శనివారం కూడా వాటిని కొనసాగించింది. ఇజ్రాయెల్ సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకొని రాకెట్లను ప్రయోగించింది. ఈ పరిణామంతో టెల్ అవీవ్.. తమ యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దింపింది. లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. తమ సైనిక పోస్టులపై రాకెట్ దాడులు చేయడం వల్లే తాము కూడా ఎదురుదాడికి దిగామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. హమాస్‌కు అండగా ఉంటామని.. అందుకోసం దేనికైనా సిద్ధమని శుక్రవారం హెజ్‌బొల్లా నేత సయ్యద్ హసన్ నస్రల్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా దాడులు జరగాయి. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి.. లెబనాన్ సరిహద్దుల్లో హెజ్‌బొల్లా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.