Israel Strike On Gaza Hospital : గాజాలోని అల్‌షిఫా ఆస్పత్రి వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆస్పత్రిని ఇజ్రాయెల్ బలగాలు చుట్టుముట్టి బాంబు దాడులు జరుపుతుండగా.. అందులో తలదాచుకున్న 14 వేలమందికి పైగా శరణార్థులు, వైద్యులు, క్షతగాత్రులు.. భయంతో గడుపుతున్నారు. ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా నిలిచి.. చివరి జనరేటర్ పనిచేయడం ఆగిపోవడం వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది.
37మంది శిశువుల ప్రాణాలు!
Israel Attack On Gaza Hospital Today : చికిత్స అందక ఇద్దరు శిశువులు సహా మరో నలుగురు క్షతగాత్రులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం తెలిపింది. మరో 37 మంది శిశువుల ప్రాణాలు ఆందోళనకరంగా ఉన్నాయని వివరించింది. అయితే అల్‌షిఫా ఆస్పత్రిలో హమాస్ కీలక స్థావరం ఉందని ఐడీఎఫ్ చెబుతోంది. అయితే ఇందుకు ఎలాంటి ఆధారాలు చూపించడం లేదని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆ ఆస్పత్రితో సంబంధాలు తెగిపోయాయని ఐక్యరాజ్యసమితి ఆవేదన వ్యక్తంచేసింది.
ప్రపంచానికి వ్యతిరేకంగానైనా..
Israel On Gaza Hospital Bombing : పౌర మరణాలు పెరుగుతుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా, బ్రిటన్‌తోపాటు ఫ్రాన్స్ కూడా యుద్ధ విరమణ చేయాల్సిందేనని సూచించింది. మిత్ర దేశాల నుంచి కూడా మద్దతు తగ్గుతుండటం వల్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్పందించారు. తమ ప్రతిజ్ఞ కోసం యావత్ ప్రపంచానికి వ్యతిరేకంగా వెళ్లడానికైనా సిద్ధమేనని తేల్చి చెప్పారు.