Hezbollah drone Israel: తమ దేశానికి చెందిన చమురు రిగ్ దిశగా దూసుకొచ్చిన మూడు హెజ్బొల్లా డ్రోన్లను ఇజ్రాయెల్ కూల్చేసింది. ఈ ఘటన మధ్యధరా సముద్రంలోని వివాదాస్పద ప్రాంతంలో చోటు చేసుకొంది. ఈ డ్రోన్లను తామే లెబనాన్ నుంచి ప్రయోగించినట్లు హెజ్బొల్లా కూడా అంగీకరించింది. దీంతో ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య కరిష్ గ్యాస్ క్షేత్రానికి సంబంధించిన యాజమాన్య హక్కులపై వివాదం కొనసాగుతోంది. దీనిని పరిష్కరించేందుకు అమెరికా దౌత్యవేత్త అమోస్ హాక్‌స్టన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ గ్యాస్ క్షేత్రం ఐరాస కేటాయించిన విధంగా తమ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోకి వస్తుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. మరో వైపు లెబనాన్ కూడా ఈ గ్యాస్ క్షేత్రం తమదే అని చెబుతోంది. ఇజ్రాయెల్ ఆ గ్యాస్ క్షేత్రం నిర్వహించకుండా అవసరమైతే బలప్రయోగం చేయడానికి కూడా వెనుకాడమని గతవారం లెబనాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ దేశం చేపట్టిన నిఘా ఆపరేషన్‌లో భాగంగా ఈ డ్రోన్లను ప్రయోగించింది. తమ ఆపరేషన్ విజయవంతమైందని లెబనాన్ ప్రకటించింది.