Israel Palestine War Update :ఇజ్రాయెల్, గాజా యుద్ధంలో ఆసక్తికర పరిణామాలు జరిగాయి. సమస్య పరిష్కారానికి రెండు దేశాల సిద్ధాంతాన్ని పశ్చిమ దేశాలు మరోసారి లేవనెత్తాయి. ఐతే ఈ రెండు దేశాల సిద్ధాంతాన్ని తాము అంగీకరిచబోమని బ్రిటన్‌లో ఇజ్రాయెల్ రాయబారి తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు వేర్వేరు దేశాలుగా ఏర్పడకుండా శాంతి ఎలా నెలకొంటుందని ప్రశ్నించగా పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ పక్కన ఒక దేశంగా ఉండాలని ఎప్పుడూ కోరుకోలేదన్న విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని సమాధానమిచ్చారు. ఇజ్రాయెల్‌తో పాటు స్వతంత్ర పాలస్తీనాను ఏర్పాటు చేయడమే ఈ రెండు దేశాలు సిద్ధాంతం. ఈ విధానానికి అమెరికా సహా పలు ఇజ్రాయెల్ అనుకూల దేశాలు మద్దతు ఇస్తున్నాయి.
అయితే ఇజ్రాయెల్ రాయబారి వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. రెండు దేశాల ఏర్పాటు ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న తమ దీర్ఘకాలిక విధానానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. గాజాలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఇది సరైనదని కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనా దేశమే లేదని ఎల్లప్పుడు చెప్పలేరని ఇజ్రాయెల్‌ను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. రెండు దేశాలు ఉండాలనేది అమెరికా, బ్రిటన్‌తో పాటు ఇజ్రాయెల్ మిత్ర దేశాల వైఖరి అని స్పష్టం చేశారు.
మరోవైపు వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్‌లో మూడో రోజూ ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్‌ను కొనసాగించింది. డ్రోన్ దాడుల్లో ఇప్పటి వరకు 11 మంది మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ జెనిన్‌లో 500 మందికిపైగా పాలస్తీనియన్లను నిర్బంధించిందని పాలస్తీనియన్ ప్రిసనర్స్ క్లబ్ అనే ఎన్జీవో పేర్కొంది. అయితే నిర్బంధించిన వారిని ఐడీఎఫ్ బలగాలు తమ సైనిక స్థావరంలో విచారించి విడుదల చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో హింసకు పాల్పడుతున్న అతివాద ఇజ్రాయెలీలను తమ దేశంలోకి అనుమతించబోమని బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ కామెరూన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరారు. అమెరికా కూడా వెస్ట్ బ్యాంక్‌లో హింసకు పాల్పడుతున్న ఇజ్రాయెలీలు తమ దేశానికి రాకుండా నిషేధం విధించింది.