Israel Palestine War :తమ దేశంపై మెరుపు దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ దీటుగా ఎదుర్కొంటోంది. దీంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతాన్యాహూ.. తమ ప్రత్యర్థులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం మనం యుద్ధంలో ఉన్నామని.. పౌరులను తరలించే కార్యక్రమం కాదని దేశ పౌరులకు వీడియో ద్వారా తెలిపారు. ఈ యుద్ధంలో మనమే కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన ప్రత్యర్థులు ఎన్నడూ చూడని రీతిలో మూల్యం చెల్లించుకుంటారని తెలిపారు. మరోవైపు హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ల దాడిలో ఓ మేయర్ సైతం మరణించారు. షార్ హంగేవ్ కౌన్సిల్ మేయర్ ఒఫిర్ లైబెస్టిన్ మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు 40 మంది పౌరులు మరణించగా.. 100 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
వీధుల్లోకి వచ్చి పౌరులపై కాల్పులు
అంతకుముందు గాజా స్ట్రిప్‌లోకి హమాస్ తీవ్రవాదులు చొచ్చుకొచ్చారు. ఓ నగరంలోకి జీప్‌లలో తుపాకులతో వచ్చిన హమాస్ మిలిటెంట్లు.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరిపారు. మరోవైపు దక్షిణ ఇజ్రాయెల్‌లోని స్డెరోట్ నగరంలోకి చొచ్చుకొచ్చిన హమాస్ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ పౌరులు ఫోన్‌లలో చిత్రీకరించారు. ప్రాణ భయంతో స్థానికులు ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఇజ్రాయెల్ 'ఐరన్ స్వార్డ్స్'..
తమ దేశ తాజా పరిణామాలపై ఇజ్రాయెల్ రక్షణ మంత్రి స్పందించారు. హమాస్ ఘోర తప్పిదం చేసిందని.. ఈ యుద్ధంలో తామే గెలుస్తామని అన్నారు. 'ఇజ్రాయెల్ సైన్యం ప్రతి చోటా శత్రువులతో పోరాడుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. భద్రతాపరమైన సూచనలను పాటించండి' అని మంత్రి చెప్పారు. అటు హమాస్‌ను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ ఆపరేషన్ 'ఐరన్ స్వార్డ్స్'ను ప్రారంభించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గాజాలోని ఓ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా ఆరోపించింది.
ఇజ్రాయెల్‌లోని భారతీయులకు అడ్వైజరీ
ఇజ్రాయెల్‌లోని భారత పౌరులకు అక్కడి భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అనవసరంగా బయటకు రావొద్దని హెచ్చరించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలనీ.. స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రొటోకాల్స్‌ను పాటించాలని సూచించింది. సురక్షిత శిబిరాలకు చేరువగా ఉండాలని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఎంబసీ సిబ్బందిని సంప్రదించాలని భారత దౌత్యకార్యాలయం అడ్వైజరీలో పేర్కొంది.