Israel Palestine War :ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. గాజా స్ట్రిప్ నుంచి తమ భూభాగంపై క్షిపణి దాడులు జరిగిన నేపథ్యంలో ఇజ్రాయెల్ స్టేట్ ఆఫ్ వార్ ప్రకటించింది. శనివారం ఉదయం ఆరున్నర ప్రాంతంలో గాజా స్ట్రిప్‌లోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం.. దక్షిణ, మధ్య ప్రాంతాల్లో దాదాపు గంటకుపైగా హెచ్చరిక సైరన్లు మోగించినట్లు సమాచారం. బాంబు షెల్టర్ల సమీపంలోనే ఉండాలని ప్రజలను ఇజ్రాయెల్ కోరినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. గాజా స్ట్రిప్ నుంచి అనేక మంది ఉగ్రవాదులు చొరబడినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదులు జరిపిన రాకెట్ దాడిలో ఓ వృద్ధురాలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
అంతకుముందు, ఇజ్రాయెల్‌పై సైనిక చర్యను ప్రారంభిస్తున్నట్లు హమాస్ మిలిటరీ గ్రూప్ వెల్లడించింది. శనివారం ఉదయం 5వేలకు పైగా రాకెట్లు ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించినట్లు తెలిపింది. 'ఆపరేషన్ అల్-అక్సా స్టోర్మ్' పేరుతో ఈ సైనిక చర్య చేపడుతున్నట్లు వెల్లడించింది. 'ఇప్పటివరకు జరిగింది చాలు. పాలస్తీనా ప్రజలందరూ ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవాలి' అని సైనిక గ్రూపు నాయకుడు మహమ్మద్ దెయిఫ్ పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ చేసిన అనేక హత్యాయత్నాలను ఎదుర్కొన్న దెయిఫ్ అత్యంత అరుదుగా బహిరంగ ప్రకటనలు చేస్తుంటారు.
ఒకరు మృతి..
కాగా, హమాస్ రాకెట్ల దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి గాయాలయ్యాయని సీఎన్ఎన్ తెలిపింది. మృతుల్లో 60 ఏళ్ల వృద్ధురాలు సైతం ఉందని విపత్తు, సహాయక సేవల ప్రతినిధి మాగెన్ డేవిడ్ ఆడమ్ తెలిపారు. 16 మందికి గాయాలయ్యాయని ఆయన వెల్లడించారు.