Israel Palestine Conflict Death Toll :ఇజ్రాయెల్ చేసిన ప్రతీకార దాడిలో పాలస్తీనాకు చెందిన 198 మంది పౌరులు మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 1,610 మంది తీవ్రంగా గాయపడినట్లు చెప్పింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన మెరుపు దాడుల్లో.. ఇప్పటి వరకు 100 మంది పౌరులు మృతి చెందగా 900 మందికి పైగా గాయపడ్డారు. హమాస్ రాకెట్ దాడులు, ఉగ్ర చొరబాట్ల తర్వాత ఇజ్రాయెల్ కూడా హమాస్‌పై యుద్ధం ప్రకటించింది. వైమానిక దాడులతో పాలస్తీనాలోని మిలిటెంట్ల స్థావరాలపై భీకరంగా విరుచుకుపడుతోంది.
అంతకుముందు ఇజ్రాయెల్‌పై శనివారం ఉదయం ఒక్కసారిగా వేలాది రాకెట్లతో హమాస్ ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ ప్రాంతాలపై 20 నిమిషాల్లోనే 5 వేల రాకెట్లను మిలిటెంట్లు ప్రయోగించారు. ఇది ఆరంభం మాత్రమే హమాస్ చీఫ్ మహ్మద్ దీఫ్ హెచ్చరించారు. గగనతల దాడులతో పాటు సరిహద్దుల నుంచి మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారు. పౌరులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. పౌరులతో పాటు ఇజ్రాయెలీ సైనికులను బంధీలుగా పట్టుకుని హింసించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సెరాట్ నగరంలోకి చొచ్చుకొచ్చిన హమాస్ తీవ్రవాదులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ పౌరులు ఫోన్లలో చిత్రీకరించారు.
రాకెట్ దాడులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ వెంటనే మేల్కొంది. రాకెట్లను అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ వ్యవస్థను యాక్టివేట్ చేసింది. హెచ్చరిక సైరన్లు మోగించి ప్రజలను బాంబు షెల్టర్లలోకి వెళ్లాలని ఆదేశించింది. హమాస్ తీవ్రవాద సంస్థపై యుద్ధం ప్రకటించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. యుద్ధ విమానాలతో గాజా స్ట్రిప్‌లోని హమాస్ మిలిటెంట్ల స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది.