Israel Palestine Conflict : ఇజ్రాయెల్ దళాలు గాజాలో ఉగ్రవేటను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే హమాస్ రాజకీయ అధిపతిగా పేరొందిన ఇస్మాయిల్ హనియా ఇంటిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్వంసం చేసింది. ఆయన నివాసంపై ఫైటర్ జెట్లతో బాంబుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియోలను ఐడీఎఫ్ ఎక్స్ లో పోస్టు చేసింది. ఇస్మాయిల్ హనియా ఇల్లు హమాస్ ఉగ్రకార్యకలాపాలకు నిలయంగా మారిందని ఆరోపించింది. హమాస్ సంస్థకు చెందిన సీనియర్ నాయకులు, వ్యూహకర్తలు ఇక్కడే సమావేశమై ఇజ్రాయెల్‌పై దాడి వ్యూహాన్ని రచించినట్లు పేర్కొంది. హనియా నివాసంతోపాటు హమాస్ నౌకాదళానికి చెందిన వివిధ ఆయుధాలను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపింది. అయితే, దాడి సమయంలో హనియా నివాసంలో ఎవరైనా ఉన్నారా అనే విషయమై ఐడీఎఫ్ ఎలాంటి స్పష్టతను ఇవ్వలేదు.
అతడి అడుగుజాడల్లోనే హనియా..!
హమాస్ రాజకీయ అధిపతి ఇస్మాయిల్ హనియా గాజా పట్టీలో నివసించడంలేదని తెలుస్తోంది. హమాస్ సంస్థ ఈనెల ప్రారంభంలో ఒక వీడియో సందేశం విడుదల చేయగా అందులో హనియా ఖతర్ రాజధాని దోహాలో ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు హమాస్ వ్యవస్థాపకుడు అహ్మద్ యాసిన్‌కు ఇస్మయిల్ హనియా అత్యంత సన్నిహితుడని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యాసిన్‌కు రాజకీయపరమైన సలహాలిస్తూ అతడికి కుడి భుజంగా మారాడని వెల్లడించింది. 2004లో ఇజ్రాయెల్ దాడుల్లో అహ్మద్ యాసిన్ హతమైన తర్వాత.. హనియా హమాస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడని తెలిపింది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు11 వేల 200 పాలస్తీనియన్లు మృతి చెందారు. అక్టోబరు 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు హతమయ్యారు.
'ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకోలేదు'
ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయట్లేదని.. హమాస్ మిలిటెంట్లు అక్కడ ఏర్పరుచుకున్న కమాండ్ అండ్ కంట్రోల్ స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ గురువారం స్పష్టం చేశారు. అలాగే ఆసుపత్రుల్లోని ఇజ్రాయెల్ పౌరులను హమాస్ దళాలు కాల్చి చంపుతున్నాయని ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.