Israel Iron Sting : హమాస్ మిలిటెంట్లపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్.. తన అమ్ములపొది నుంచి అత్యాధునిక ఆయుధాన్ని బయటికి తీసింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, ఐరన్ బీమ్‌లను ఉపయోగించిన నెతన్యాహు సేన.. తాజాగా ఐరన్ స్టింగ్ అనే అత్యాధునిక ఆయుధ వ్యవస్థను ప్రత్యర్థిపై ఎక్కుపెట్టింది. గాజా పట్టీలో జనావాసాల మధ్య నుంచి రాకెట్లను ప్రయోగించే లాంచర్లను ధ్వంసం చేయడానికి 10రోజుల క్రితం నుంచి ఐరన్ స్టింగ్ అనే ఆయుధాన్ని వాడుతోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. తొలిసారి ఈ ఆయుధాన్ని వాడుతున్నట్లు పేర్కొని ఐరన్ స్టింగ్ దాడులకు సంబంధించిన చిత్రాలను పోస్టు చేసింది.
కచ్చితత్వంతో లక్ష్యాలను..
Iron Sting Israel :యుద్ధాల్లో వాడేందుకు ఐరన్ స్టింగ్ పేరిట 120ఎంఎం మోర్టార్‌ను ఇజ్రాయెల్ తయారు చేసింది. కాకపోతే దీనికి గైడెడ్ వ్యవస్థ ఉంటుంది. ఇది అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. భూతల ఆపరేషన్ల స్వరూపాన్నే పూర్తిగా మార్చేసే ఐరన్ స్టింగ్‌ను గేమ్ ఛేంజర్‌గా ఐడీఎఫ్ భావిస్తోంది. హమాస్ రాకెట్ లాంచర్లు, సొరంగాలపై పైచేయి సాధించటానికి ఐరన్ స్టింగ్ ఉపయోగపడుతుందని ఇజ్రాయెల్ గట్టి విశ్వాసంతో ఉంది.
గైడెడ్ వ్యవస్థతో శత్రు స్థావరాలను..
Iron Sting Mortar Bomb : సాధారణంగా మోర్టార్ గుండును పేల్చినప్పుడు.. అది లక్ష్యానికి కొంత అటూఇటుగా తాకుతుంది. ఈక్రమంలో పౌరులు, వారి ఆస్తులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కానీ, ఐరన్ స్టింగ్‌లోని గైడెడ్ వ్యవస్థతో శత్రు స్థావరాలను లేదా వారికి చెందిన వ్యవస్థలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయవచ్చు. అత్యధిక జనాభాతో కిక్కిరిసిన గాజావంటి ప్రదేశాల్లో లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించడానికి ఐరన్‌స్టింగ్ అనువుగా ఉంటుంది.