Israel Hostages Killed : ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్.. గాజాపై జరిపిన వైమానిక దాడుల్లో తమ వద్ద బందీలుగా 13 మంది బందీలు మరణించినట్లు హమాస్ తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు దిగిన హమాస్ మిలిటెంట్లు.. విదేశీయులు సహా 150 మంది పౌరులను బందీలుగా తరలించుకుపోయారు. ఈ క్రమంలో వారిని విడిపించుకునే దిశగా ఇజ్రాయెల్ ఇప్పటికే గాజాకు నీరు, విద్యుత్, ఇంధన సరఫరాలు నిలిపివేసింది. దీంతో పాటు గాజాపై భీకర వైమానిక దాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో ఆయా చోట్ల దాదాపు 13 మంది బందీలు మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది. వారిలో విదేశీయులు కూడా ఉన్నట్లు తెలిపింది.
'గత 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులకు పాల్పడిన ఐదు ప్రాంతాల్లో విదేశీయులు సహా 13 మంది బందీలు మృతి చెందారు' అని హమాస్ మిలిటరీ విభాగం ప్రకటించింది. అయితే, వారి ఏ దేశస్థులో వెల్లడించలేదు. ఇజ్రాయెల్ సైతం ఈ ప్రకటనపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. బందీలను విడిపించుకునేందుకుగానూ ఇజ్రాయెల్ ప్రస్తుతం గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది పాలస్తీనా పౌరులు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలను ఐక్యరాజ్యసమితి ఖండించింది.
గాజాపై బాంబుల మోత..
Israel Attack On Gaza : హమాస్ మిలిటెంట్ల మెరుపు దాడితో గాజా స్ట్రిప్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది. హమాస్ మిలిటెంట్ సంస్థ ఇజ్రాయెల్‌పై 5 వేలకుపైగా రాకెట్లు ప్రయోగించగా.. ఇజ్రాయెల్ కూడా 6 వేల బాంబులను గాజాపై వేసింది. వీటి బరువు 4 వేల టన్నులకుపైనే ఉంటుంది. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల వల్ల మరణించిన వారి సంఖ్య 1400 దాటింది. తమ వైమానిక దళం గాజాలో 3600 లక్ష్యాలను ఛేదించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
మరోవైపు గాజా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ తెల్ల భాస్వరంతో కూడిన బాంబులను వేస్తున్నట్లు లెబనాన్‌లోని మానవ హక్కుల సంఘం ఆరోపించింది. వేగంగా మంటలు అంటుకునే గుణం ఉన్న తెల్ల భాస్వరం రసాయనం వల్ల శరీరం కాలిపోయే ప్రమాదం ఉంటుంది. తీవ్రమైన, దీర్ఘకాల గాయాలకు తెల్ల భాస్వరం బాంబులు దారితీస్తాయి. అక్టోబర్ 10, 11వ తేదీల్లో గాజా, లెబనాన్‌పై తెల్ల భాస్వరంకు చెందిన బాంబులు పేలినట్లు ఉన్న కొన్ని ఫొటోలను మానవ హక్కుల సంస్థ విడుదల చేసింది. ఆకాశంలో ఏర్పడిన తెల్ల మబ్బులకు చెందిన ఫొటోల ఆధారంగా బాంబు దాడుల్లో తెల్ల భాస్వరాన్ని ఇజ్రాయెల్ ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఆక్సిజన్‌తో కలిసినప్పుడు వైట్ ఫాస్పరస్ మండుతుంది. ఆ మంటతో తెల్ల పొగ కమ్ముకుంటుంది.
అంతర్జాతీయ చట్టాల ప్రకారం తెల్ల భాస్వరంతో తయారైన బాంబుల వినియోగంపై నిషేధం లేదు. కానీ ఆ రసాయనం వల్ల మనుషులకు తీవ్రమైన గాయాలయ్యే అవకాశం ఎక్కువ. అయితే తెల్ల భాస్వరం బాంబులపై ఇజ్రాయెల్ సైనిక వర్గాలు స్పందించలేదు. వాటిని వాడుతున్నట్లు తమకు సమాచారం లేదని వెల్లడించాయి. 2008-09లో గాజాపై దాడి సమయంలో వైట్ ఫాస్పరస్ స్మోక్ స్క్రీన్ ఆయుధాలను ఇజ్రాయెల్ ఉపయోగించింది. వివిధ మానవహక్కుల సంఘాల నుంచి యుద్ధ నేరాల ఆరోపణలు రావడం వల్ల వీటిని దశలవారీగా తొలగించినట్లు 2013లో ఇజ్రాయెల్ తెలిపింది.
హమాస్‌తో సైనికుల పోరాటం వీడియో..
ఇజ్రాయెల్ సైనికులు హమాస్‌తో ఏ విధంగా పోరాటం చేస్తున్నారో తెలిపే ఓ వీడియోను ఇజ్రాయెల్ ఫ్రంట్ ఫోర్స్ (IFF).. ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేసింది. 'శనివారం ఇజ్రాయెల్‌పై దాడి చేసి వందలాది మందిని హమాస్ బందీలుగా చేసుకొంది. గాజా సరిహద్దుల్లో వారిని బంధించిందనే సమాచారంతో ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) హమాస్ మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసి, బందీలను సురక్షితంగా విడిపించాయి. ఈ దాడిలో 60 మంది ఉగ్రవాదులను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. హమాస్ దక్షిణ నేవీ కమాండర్ మహమ్మద్ అబు అలీని మా దళాలు అదుపులోకి తీసుకున్నాయి' అని ట్వీట్‌లో పేర్కొంది.