Israel Hamas War :పాలస్తీనాపై సాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం అక్కడితో ఆగుతుందా? విస్తరిస్తుందా? ఇతర దేశాలూ ఇందులో అడుగుపెడతాయా? బుధవారంనాటి పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరిఅవుతుండగా... మరోవైపు, లెబనాన్, సిరియాల నుంచీ ఇజ్రాయెల్ వైపు రాకెట్లు దూసుకురావడం, ఖతార్, ఇరాన్‌లాంటివి పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌కు పూర్తిగా అండగా ఉంటామని అమెరికా, ఈయూ దేశాలు ప్రకటించడం ఐక్యరాజ్య సమితి సహా అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది.
వారూ దిగితే..
Israel War Escalation :పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌పై గాజాలో ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌పై బుధవారం మరోవైపు నుంచి దాడి ఎదురైంది. పక్కనున్న లెబనాన్, సిరియాల్లో హెజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్ దళాలు ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. అసలే గాజాలో ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి దిగజారుతుందని భావిస్తున్న ఐక్యరాజ్య సమితి.. సిరియా, లెబనాన్‌ల నుంచి దాడులతో మరింత ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది.
హమాస్‌కు సిరియా, లెబనాన్ మద్దతుగా ఉంటాయి. ఈ రెండూ కదనరంగంలోకి దిగితే ఇజ్రాయెల్ మూడు వైపులా యుద్ధం చేయాల్సి వస్తుంది. అన్నింటికీ మించి... ఇజ్రాయెలీలపై హమాస్ దాడిలో ఇరాన్ ప్రమేయం ఉందని నిర్ధరణ అయితే పరిస్థితి మరింత దిగజారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లెబనాన్, సిరియాలతో పాటు ఇరాన్, ఖతార్, కువైట్ హమాస్‌కు మద్దతు ఇస్తున్నాయి. హమాస్ తీవ్రవాదులకు ఇరాన్ అన్ని విధాలుగా అండగా ఉంటుందనే విషయం బహిరంగ రహస్యమే. ఈ దేశాలన్నీ హమాస్‌కు మద్దతుగా నిలిస్తే యుద్ధం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.