Israel Hamas War Update :భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పాలస్తీనియన్ అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో గురువారం ఫోన్లో మాట్లాడారు. మంగళవారం గాజాలోని అల్-అహ్లి అరబ్ ఆస్పత్రిపై జరిగిన దాడిలో పౌరుల మరణాల పట్ల సంతాపం తెలియజేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్య పట్ల భారత్ దీర్ఘకాల వైఖరిని పునరుద్ఘాటించారు. ఆ ప్రాంతంలో పెరుగుతున్న తీవ్రవాహం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులపై మోదీ సంభాషించారు. పాలస్తీనా ప్రజలు కోసం భారత్ మానవతా సహాయాన్ని కొనసాగిస్తుందని అబ్బాస్‌కు చెప్పారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
భారతీయులను తరలించడం కష్టతరమే : అరిందమ్ బాగ్చి
మరోవైపు, గాజా నుంచి భారతీయులను తీసుకురావడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టతరమని విదేశి వ్యవహరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏ చిన్న అవకాశం ఉన్నా వారిని భారత్‌కు తరలిస్తామని వెల్లడించింది. ఇప్పటివరకు పాలస్తీనాలో నలుగురు భారతీయులు మాత్రమే ఉండగా.. అందులో ఒకరు వెస్ట్ బ్యాంక్‌లో ఉన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరిగిన దాడుల్లో మరణించిన వారిలో భారతీయులు ఎవరూ లేరని ఆయన తెలిపారు.
Gaza Hospital Attack :గాజాలో జరుగుతున్న ఉగ్రదాడులను బాగ్చి ఖండించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్ దానిని సహించదని పేర్కొన్నారు. ఇటీవల అక్కడి ఆసుపత్రిపై జరిగిన దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. పాలస్తీనా సమస్యను ఇరు పక్షాలు చర్చించుకుని పరిష్కరించుకోవాలని బాగ్చి సూచించారు. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులను ఇప్పటికే ఆపరేషన్ అజయ్ పేరిట స్వదేశానికి కేంద్రం తీసుకువస్తోంది.