తెలంగాణ

telangana

By PTI

Published : Dec 24, 2023, 7:01 PM IST

ETV Bharat / international

ఇజ్రాయెల్ బాంబుల మోత- దీటుగా హమాస్ పోరాటం- గుక్కెడు గంజి కోసం గాజా ప్రజల తిప్పలు

Israel Hamas War News Today : మధ్య గాజాస్ట్రిప్‌ ప్రాంతంలో పరిస్థితి భయానకంగా ఉంది. దాడులు ఉద్ధృతంగా సాగుతున్న నేపథ్యంలో స్థానికులను దక్షిణ గాజాకు పారిపోవాలని ఇజ్రాయెల్‌ సైన్యం హెచ్చరించింది. ఫలితంగా వేలాదిమంది బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్లను విడిచిపెట్టి తరలిపోతున్నారు. బాంబు దాడుల్లో మరణించినవారి మృతదేహాలతో పలు ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. ఆహార సంక్షోభం తీవ్రమై ప్రజలు అన్నం కోసం సహాయక కేంద్రాల వద్ద పాత్రలు పట్టుకుని పడిగాపులు గాస్తున్నారు.

Israel Hamas War News Today
Israel Hamas War News Today

Israel Hamas War News Today :గాజాలో ఇజ్రాయెల్‌ సైన్యం నిరంతర దాడులతో విరుచుకుపడుతోంది. మధ్య గాజాపై దృష్టి పెట్టిన ఐడీఎఫ్‌ బలగాలు అక్కడ విధ్వంసం సృష్టిస్తున్నాయి. బురెజీ శరణార్థి శిబిరం పరిసర ప్రాంతాలను విడిచి, దక్షిణ గాజాలోని డెర్‌ అల్‌ బలాహ్‌ ప్రాంతానికి పారిపోవాలని ( Israel Warning To Gaza Civilians ) గాజా పౌరులను హెచ్చరించాయి. దీంతో వేలాదిమంది డెర్‌ అల్‌ బలాహ్‌కు తరలివెళ్తున్నారు. కాలినడక, గుర్రం, గాడిద బండ్లే వారికి దిక్కయ్యాయి. చేతిలో చిల్లిగవ్వా లేదు. ఒకవేళ ఉన్నా ఆహారం కూడా దొరకని పరిస్థితి వారికి దాపురించింది. చిన్నపిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే శరణార్థులతో నిండిపోయిన డెల్‌ అల్‌ బలాహ్‌లో మౌలిక సదుపాయాలు పూర్తిగా కొరవడ్డాయి. కొత్తగా తరలివెళ్లే వారికోసం అక్కడ చోటే లేకుండా పోయింది. చాలా మంది టెంట్ల వెలుపల బహిరంగ ప్రదేశాల్లోనే బతుకీడుస్తున్నారు.

యుద్ధ భూమిలో ఇజ్రాయెల్ బలగాలు
ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకు

రఫాలో బాంబు దాడులు కొనసాగుతున్నాయి. శరణార్థి శిబిరాలపై జరిగిన దాడిలో చాలా భవనాలు శిథిలమయ్యాయి. 24 గంటల్లో గాజాలో 201 మంది మరణించారని అక్కడి ఆరోగ్యశాఖ ఆదివారం తెలిపింది. శుక్ర, శనివారాల్లో 14 మంది ఇజ్రాయెల్ సైనికులు దాడుల్లో మరణించారు. యాంటీ ట్యాంక్ మిసైళ్ల దాడిలో నలుగురు జవాన్లు మరణించారని, మిగిలిన సైనికులు మిలిటెంట్లతో జరిగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ ఆర్మీ రేడియో వెల్లడించింది. ఇజ్రాయెల్ చెప్పినట్లు పోరాటంలో హమాస్ వెనక్కి తగ్గడం లేదని, సైనికుల మృతుల సంఖ్యే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.

దాడుల్లో ధ్వంసమైన భవనం
ధ్వంసమైన భవనాలు
శిథిలాల్లో వస్తువులు వెతుక్కుంటున్న కుటుంబం

గంజి కోసం ఎగబడుతున్న చిన్నారులు
Israel Humanitarian Issues :మరోవైపు, మానవతాసాయం పంపిణీకి ఇజ్రాయెల్‌ అడ్డంకులు సృష్టిస్తోందని ఐక్యరాజ్య సమితి అసహనం వ్యక్తం చేసింది. మానవతాసాయం అందక ప్రజలు ఆహారం, నీటి కోసం అలమటిస్తున్నారు. చిన్నారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. స్థానిక స్వచ్ఛంద సేవల కేంద్రాల వద్ద చిన్నారులు బకెట్లు, మగ్‌లు పట్టుకుని గుక్కెడు గంజి కోసం ఎగబడటం కన్నీరు పెట్టిస్తోంది. ఉత్తరగాజా వాసులు భారీగా దక్షిణ ప్రాంతాలకు వస్తుండటం వల్ల ఈ దుస్థితి తలెత్తినట్లు తెలిసింది. తమ వద్ద వంటగ్యాస్‌ లేదని, ఉన్న కట్టెలూ అయిపోతున్నాయని అక్కడి సిబ్బంది తెలిపారు. ఇంకా ఎన్ని రోజులు ప్రజలకు ఆహారం అందిస్తామో తెలియదని వివరించారు.

వంతులవారీగా ఆహారం వండుకుంటున్న గాజా ప్రజలు
రొట్టెలు కాల్చుకుంటున్న ప్రజలు
రొట్టెలు కాల్చుకుంటున్న ప్రజలు

బయటపడ్డ హమాస్ టన్నెల్​​- భూగర్భంలో స్పెషల్​ రూమ్స్- కరెంట్​, సెక్యూరిటీ కెమెరాలు కూడా!

ఇజ్రాయెల్ భీకర దాడులు- ఒకే కుటుంబంలో 76 మంది మృతి- గాజాపై 208 విధ్వంసకర బాంబుల ప్రయోగం!

ABOUT THE AUTHOR

...view details