Israel Hamas War Latest Update :గాజా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా రోజూ 4 గంటలు యుద్ధానికి విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా తెలిపింది. ప్రస్తుతానికి కాల్పుల విరమణకు ఎటువంటి అవకాశం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. గాజా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా యుద్ధానికి విరామం ప్రకటించాలన్న నిర్ణయం తాను అనుకున్న దానికంటే ఆలస్యంగా జరిగిందని బైడెన్ పేర్కొన్నారు. హమాస్ వద్ద ఉన్న బందీలను విడిపించేందుకు, మిలిటెంట్లతో చర్చలు జరపడానికి యుద్ధాన్ని 3 రోజులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కోరినట్లు తెలిపారు.
గాజా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ఉద్దేశించిన యుద్ధం విరామాన్ని ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటిస్తుందని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా రెండో కారిడార్‌ను తెరిచేందుకు ఆ దేశం అంగీకరించిందని వెల్లడించారు. మరోవైపు, అమెరికా ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించింది.
మరోవైపు భూతల పోరులో కీలక ఘట్టానికి చేరుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్ గాజా సిటీలో చాలా దూరం చొచ్చుకొచ్చింది. దేశంలో అతి పెద్ద అల్ షిఫా ఆసుపత్రి సమీపంలోకి ఇజ్రాయెల్ దళాలు చేరుకున్నాయి. హమాస్ దళాలతో అక్కడ తీవ్ర పోరు జరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రి వద్ద వేల మంది శరణార్థులు ఉన్నారు. హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఈ ఆసుపత్రి కింద ఉందని.. దానిని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. చాలా మంది హమాస్ కమాండర్లు ఇక్కడే ఉన్నారని చెప్పింది.