Israel Hamas War Latest : హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతి దాడులతో పశ్చిమాసియా నెత్తురోడుతోంది. హమాస్‌తో అధికారికయుద్ధానికి ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలపడం వల్ల దేశ సైన్యం గాజా స్ట్రిప్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఇరువైపులా 1100 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా, హమాస్‌కు మద్దతుగా లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లు రంగప్రవేశం చేయటం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.
Israel Hamas War News :డజన్లకొద్దీ రాకెట్లు, మోర్టార్ షెల్స్‌తో ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై హెజ్‌బొల్లా ఉగ్రవాదులు దాడి చేశారు. పాలస్తీనా పోరాటానికి సంఘీభావంగా రాకెట్లు, షెల్స్‌ను ప్రయోగించినట్లు హెజ్‌బొల్లా గ్రూప్ ప్రకటించింది. ఈ దాడులను ఇజ్రాయెల్ దళాలు తిప్పికొట్టాయి. హమాస్ ఉగ్రవాదుల చేతిలో బందీగా ఉన్నవారి రక్షణకు ఇజ్రాయెల్.. ఈజిప్టు సాయం కోరింది. ఈజిప్టు నిఘా విభాగాధిపతి హమాస్ ప్రతినిధులతో మాట్లాడినట్లు కథనాలు వెలువడ్డాయి.
ఇజ్రాయెల్‌కు అండగా అమెరికా..
Israel Hamas War Live :హమాస్ ఉగ్రవాదుల దాడులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఇజ్రాయెల్‌కు సహాయంగా తూర్పు మధ్యధరా సముద్రానికి ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌ను పంపించనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్‌కు చెందిన దాదాపు 5వేల మంది నావికులను పంపనున్నట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో నౌకలు, యుద్ధ విమానాలను పంపనున్నట్లు తెలిపారు. హమాస్‌కు ఆయుధాలు అందకుండా నిలువరించటమే లక్ష్యమని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల మద్దతు కోసం అమెరికా ప్రయత్నాలు...
Israel Hamas War America : ఇజ్రాయెల్‌కు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తీవ్రవాదుల దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. జోర్డాన్ రాజుతో మాట్లాడినట్లు చెప్పారు. ఈజిప్టు, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఒమన్, యూఏఈ దేశాలతో సంప్రదింపులు జరపాలని తన బృందానికి సూచించినట్లు బైడెన్ వివరించారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి బ్లింకెన్ ఫోన్‌లో చర్చలు జరిపారు. వెస్ట్ బ్యాంకులో శాంతి, స్థిరాత్వాన్ని నెలకొల్పాలని ఆయన కోరారు. మరోవైపు, ఇజ్రాయెల్‌పై దాడి నేపథ్యంలో మిలిటెంట్ల అదుపులో 100 మందికి పైగా బందీలుగా ఉన్నారని హమాస్ సీనియర్ అధికారి తెలిపారు.
భీకర యుద్ధం.. చిక్కుకున్న 18వేల మంది భారతీయులు
Indians In Israel : ఇజ్రాయెల్ - హమాస్ ఉగ్రవాదుల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారత పౌరుల గురించి ఆందోళన నెలకొంది. దాదాపు 18 వేల మందికి పైగా భారతీయులు ఇజ్రాయెల్‌లోని వివిధ పట్టణాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి భారతీయులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.