Israel Hamas War :ఇజ్రాయెల్ దాడులతో గాజా అల్లకల్లోలం అవుతోంది. వైమానిక దాడులు చేయడం వల్ల గాజా నగరంలో వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. విద్యుత్, ఇంధనం, ఆహారాన్ని నిలిపివేసిన ఇజ్రాయెల్... మరోవైపు నుంచి వైమానికి దాడులతో గాజా నగరంపై ముప్పేట దాడి చేస్తోంది. గాజాలోని రెండు వందల మిలిటెంట్ల స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) ధ్రువీకరించింది. వీటిలో మిలిటెంట్లు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్టుమెంట్ భవనం ఉన్నాయని తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలను అధికారిక వైబ్‌సైట్‌లో ఉంచింది. దాదాపు 790 హౌసింగ్ యూనిట్లు కుప్పకూలగా... 5,330 ఇళ్లు దెబ్బతిన్నాయని ఐరాస మానవత్వ వ్యవహారాల కార్యాలయం వెల్లడించింది. దీంతోపాటు 3 తాగునీటి, పారిశుద్ధ్య విభాగ కేంద్రాలూ దెబ్బతిన్నట్లు తెలిపింది. దాదాపు 4 లక్షల మందికి ఈ సేవలు నిలిచిపోయినట్లు వివరించింది. 23 లక్షల జనాభా ఉన్న గాజాలో ప్రస్తుత దాడుల కారణంగా లక్ష 86 వేల మంది ఐక్యరాజ్యసమితి శిబిరాల్లో తల దాచుకునేందుకు వచ్చారు.
Israel Palestine Death Count : మరోవైపు వందల మంది హమాస్ మిలిటెంట్లు భవనాల కిందే సమాధి అయ్యారని ఇజ్రాయెల్ వెల్లడించింది. పాలస్తీనా వాసులు వీలైనంత త్వరగా ఈజిప్టుకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం సూచించింది. గాజాకు ఈజిప్టుకు నుంచి సాయం అందుతోంది. 2 టన్నుల ఔషధాలను పంపింది. యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటిదాకా ఇరువైపుల 1,750 మంది మరణించారు. ఇందులో వెయ్యి మంది ఇజ్రాయెలీలు, 750 మంది పాలస్తీనా వాసులు ఉన్నారు. తాము 1,500 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Israel Palestine War : ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ చేసి గాజాకు తీసుకెళ్లిన వారికి ఏమైనా జరిగితే హమాస్ పరిస్థితి మరింత దిగజారుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. హమాస్ ఉగ్రవాదుల చేతిలో బందీలుగా ఉన్న వారి కుటుంబాలను కలిసి సమాచారం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం అధికారులను పంపింది. దాదాపు వంద కుటుంబాల వద్దకు ఈ అధికారులు వెళ్లి... వారి ఆత్మీయులు గాజాలో హమాస్ వద్ద బందీలుగా ఉన్న విషయాన్ని వెల్లడించారు. కిడ్నాప్‌నకు గురైన వారి సంఖ్య వంద నుంచి 150 మధ్యలో ఉంటుందని భద్రతా దళాలు ఇప్పటికీ అనుమానిస్తున్నాయి. బందీలను హతమారిస్తే హమాస్ ఉనికి లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. బందీలుగా ఉన్న వారిలో వృద్ధురాలికైనా, పసికందుకైనా వారు హాని చేస్తే... అది హమాస్ పరిస్థితిని మరింత దిగజారుస్తుందని ఐడీఎఫ్ తెలిపింది. మిలిటెంట్ల చొరబాట్లకు ఇంకా ముప్పు పొంచి ఉన్న వేళ... సరిహద్దుల్లోని ఇజ్రాయెల్ దళాలకు కీలక ఆదేశాలందాయి. గాజావైపు నుంచి ఎవరైనా సరిహద్దులను దాటే ప్రయత్నం చేస్తే వారిని కాల్చివేయాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశించింది.