Israel Hamas War :అక్టోబరు 7న హమాస్ జరిపిన మెరుపు దాడులకు ప్రతీకారంగా.. గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా భూతల, వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నడిచే ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో 15 మంది మరణించారు. మరో 70మంది గాయపడినట్లు గాజా వైద్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Israel Palestine War Latest News : మరోవైపు ఉత్తర గాజాలోని పౌరులు దక్షిణ గాజాకు తరలిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం మరోసారి హుకుం జారీ చేసింది. ప్రాణాలతో ఉండాలంటే.. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల సమయంలో తాము సూచించిన మార్గం గుండా వెళ్లిపోవాలని సూచించింది. అయితే దక్షిణ గాజాలో ఉన్నా కూడా దాడులు జరుగుతుండటం వల్ల ప్రజలు తిరిగి ఉత్తర గాజా వైపు వెళ్లిపోతున్నారు.
Israel Attack on Lebanon : శరణార్థి శిబిరంలో ఉన్న హమాస్ బహిష్కృత నేత ఇస్మాయెల్ నివాసాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో సంప్రదింపులు నిలిపివేస్తున్నట్లు తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ స్పష్టం చేశారు. గాజాలో జరుగుతున్న నరమేథానికి బాధ్యుడైన నెతన్యాహుతో.. ఎలాంటి చర్చలు ఉండవని ప్రకటించారు. ఇజ్రాయెల్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించినట్లు తుర్కియే స్పష్టం చేసింది. లెబనాన్‌తో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లోని హిజ్బుల్లా శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. అంతకుముందు ఇజ్రాయెల్ సైనిక శిబిరాలపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులు చేయటం వల్ల ప్రతీకార చర్యలకు దిగింది. ఇప్పటివరకు మృతి చెందిన వారిసంఖ్య 9,488కు చేరింది. అందులో 3,900 మంది చిన్నారులు ఉన్నారు.