Israel Hamas War :లెబనాన్ రాజధాని బీరుట్ శివారులో మంగళవారం ఇజ్రాయెల్ జరిపిన డ్రోన్ దాడిలో హమాస్ అగ్రనేత, మిలిటెంట్ విభాగం వ్యవస్థాపకుల్లో ఒకరైన సలేహ్ అరౌరీ మృతి చెందాడు. డ్రోన్ దాడితో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించినట్లు లెబనాన్ అధికారి వెల్లడించారు. మృతుల్లో అరౌరీ కూడా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది.
యుద్ధం మరింత తీవ్రం!
హెజ్‌బొల్లాకు గట్టి పట్టున్న ప్రాంతమైన దక్షిణ బీరుట్ శివారులో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అరౌరీ హత్య నేపథ్యంలో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసిన లెబనాన్ ఆపద్ధర్మ ప్రధాని నజీబ్ మికాతీ ఇజ్రాయెల్ తమను యుద్ధంలోకి లాగాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
గాజాపై ఉద్ధృతంగా దాడులు
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై దాడులు ఉద్ధృతం చేసింది ఇజ్రాయెల్. ఉత్తర గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకున్న ఇజ్రాయెల్- దక్షిణాన భీకరంగా విరుచుకుపడుతోంది. వైమానిక, క్షిపణి దాడులతో బలగాలు బెంబేలెత్తించాయి. మధ్య గాజాలోని బురెజ్ శరణార్థి శిబిరం వద్ద భీకరంగా భూతల పోరు జరుగుతోంది. నుసైరత్, బురెజ్ ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. జబలియా శరణార్థి శిబిరం చుట్టూ దాడులు కొనసాగుతున్నాయి. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించేవరకు యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్ చెరలో బందీలుగా ఉన్న 100 మందిని విడిపించుకుంటామని తెలిపారు. యుద్ధం మరిన్ని నెలలు కొనసాగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.