Israel Hamas War :ఇజ్రాయెల్‌లో రసాయన దాడులూ చేసేందుకు హమాస్ సిద్ధమైందని.. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలు తమకు లభ్యమైనట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌పై భారీ ఎత్తున విధ్వంసానికి సిద్ధమయ్యే.. హమాస్ ఈ దాడులను ప్రారంభించిందని ఐజాక్ ఆరోపించారు. రసాయన ఆయుధాలను ఎలా తయారు చేయాలో వివరించే పూర్తి సమాచారం హమాస్ మిలిటెంట్ల వద్ద ఉన్నట్లు హెర్జోగ్ పేర్కొన్నారు. దీన్ని వాళ్లు ఉగ్రసంస్థ అల్ ఖైదా నుంచి పొందినట్లు ఆయన ఆరోపించారు.
తమ సైన్యం జరిపిన దాడుల్లో మృతి చెందిన ఓ హమాస్‌సాయుధుడి వద్ద అందుకు సంబంధించిన ఆధారాలు లభించినట్లు ఐజాక్ వెల్లడించారు. ప్రాథమిక పాఠశాలలు, యూత్ సెంటర్ల వంటి వాటిని లక్ష్యంగా చేసుకుంటూ వీలైనంత ఎక్కువ మందిని చంపడమో లేదా బందీలుగా చేసుకోవమో చేయాలని అందులో ఉన్నట్లు పేర్కొన్నారు. సాయుధుడి మృతదేహం వద్ద సైనైడ్ డిస్పర్షన్ డివైజ్ ఎలా వాడాలో వివరించే యూఎస్‌బీ దొరికినట్లు తెలిపారు. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్‌కు సంబంధించిన పత్రాలు, జెండాలు సైతం మరణించిన హమాస్ సభ్యుల దగ్గర లభించినట్లు ఐజాక్ తెలిపారు. మరోవైపు.. గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో వందల మంది మరణించినట్లు తెలుస్తోంది.