తెలంగాణ

telangana

ETV Bharat / international

ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం- మరో రెండురోజులపాటు ఇజ్రాయెల్​-హమాస్​ యుద్ధానికి బ్రేక్! - ఇజ్రాయెల్ హమాస్ కాల్పుల విరమణపై జోబైడెన్

Israel Hamas Truce Deal : ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంలో ఇజ్రాయెల్​, హమాస్​ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండురోజుల పాటు కొనసాగనుంది. మరోవైపు టెస్లా అధినేత ఎలాన్​ మస్క్ ఇజ్రాయెల్​లో పర్యటించారు.

israel hamas war news
israel hamas war news

By PTI

Published : Nov 28, 2023, 7:16 AM IST

Updated : Nov 28, 2023, 9:37 AM IST

Israel Hamas Truce Deal : ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో రెండు రోజులు కొనసాగనుంది. తొలుత కుదుర్చుకున్న నాలుగు రోజుల ఒప్పందం సోమవారంతో ముగియడం వల్ల ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో రెండు రోజుల పొడిగింపునకు రెండు వర్గాలు అంగీకరించాయి. ఈ ఒప్పందం ప్రకారం హమాస్ ప్రతి రోజూ 10 మంది ఇజ్రాయెలీలను విడిచి పెట్టనుండగా ప్రతి ఒక్క బందీకి బదులుగా ముగ్గురు పాలస్తీనా వాసులను ఇజ్రాయెల్ వదిలి పెట్టనుంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి హమాస్ 58 మంది బందీలను, ఇజ్రాయెల్ 114 మంది పాలస్తీనియన్‌ ఖైదీలను విడుదల చేశాయి. నాలుగో విడత కింద హమాస్ మరో 11 మంది బందీలను రెడ్‌ క్రాస్‌ సంస్థకు అప్పగించింది. మరోవైపు హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పునరుద్ఘాటించారు.

ఇజ్రాయెల్​లో ఎలాన్ మస్క్ పర్యటన..
టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. హమాస్‌-ఇజ్రాయెల్‌ దళాల మధ్య బందీల విడుదల ఒప్పందం పొడిగించాలని డిమాండ్లు పెరుగుతున్న వేళ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహుతో కలిసి మస్క్‌ పలు ప్రాంతాలను సందర్శించారు. ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల హమాస్ దాడి చేసిన కిబ్బట్జ్‌, కెఫర్‌ అజ్జా ప్రాంతాలను మస్క్‌ సందర్శించారు. ఈ ప్రాంతాలను సందర్శిస్తున్న సమయంలో ఎలాన్‌ మస్క్‌.. తన ఫోన్‌ ఉపయోగించి జరిగిన నష్టాన్ని వీడియో తీశారు. నెతన్యాహు.. మస్క్‌కు హమాస్‌ దాడి గురించి వివరించారు.

కాల్పుల విరమణను స్వాగతించిన బైడెన్​..
ఇజ్రాయెల్-హమాస్​ల కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రెండు రోజులు పొడిగించడాన్ని స్వాగతిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బెడెన్ తెలిపారు​. దౌత్యం, మధ్యవర్తిత్వం ద్వారా కాల్పుల విరమణను మరిన్ని రోజులు కొనసాగేలా చేసే పనిలో గత కొద్ది రోజులుగా తాను నిమగ్నమై ఉన్నానని అన్నారు. 'ఈ డీల్ ఎన్నో ప్రాణాలను కాపాడుతోంది. గాజాకు అత్యంత అవసరమైన మానవతా సాయం అందుతోంది. ఈ ఫలితాలను ఇలాగే పొందేందుకు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించవచ్చు. ఇదే నా లక్ష్యం. బందీల్లో ఓ నాలుగేళ్ల పసిపాప ఉంది. ఆ పసి హృదయం దారుణంగా గాయపడింది.' అనని జో బైడెన్ అన్నారు.

గాజాలో సైనికులతో నెతన్యాహు- కాల్పుల విరమణ పొడగిస్తారా? ఇజ్రాయెల్ స్పందన ఇదే!

అమల్లోకి వచ్చిన ఇజ్రాయెల్- హమాస్ కాల్పుల విరమణ- 13మంది బందీలు విడుదల!

Last Updated : Nov 28, 2023, 9:37 AM IST

ABOUT THE AUTHOR

...view details