Israel Hamas Ceasefire: ఇజ్రాయెల్-హమాస్ మధ్య నాలుగు రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో ఆ ఒప్పందం పొడగింపుపై ఆసక్తి నెలకొంది. మూడో విడతలో భాగంగా హమాస్.. 17మంది బందీలను విడుదల చేసి రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. అందులో 14మంది ఇజ్రాయెల్ పౌరులు, ముగ్గురు విదేశీయులు ఉన్నారు. 14మంది ఇజ్రాయెల్ పౌరుల్లో 9మంది చిన్నారులు ఉండగా.. విదేశీయుల్లో నాలుగేళ్ల అమెరికన్ కూడా ఉన్నారు. ప్రతిగా ఇజ్రాయెల్.. తమ జైళ్లలో ఉన్న 39మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఒప్పందంలో భాగంగా ఇప్పటివరకు హమాస్ 58మందిని, ఇజ్రాయెల్ 114 మందిని విడుదల చేశాయి.
కాల్పుల విరమణ అమలులో ఉండటం వల్ల సంక్షోభంలో ఉన్న గాజాకు ఇప్పుడు సులభంగా మానవతాసాయం అందుతోంది. 120ట్రక్కులు గాజాకు బయల్దేరినట్లు ఈజిప్టు తెలిపింది. ఇరుపక్షాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ముగియనుండటం వల్ల.. ఒప్పందాన్ని పొడిగిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరుగుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. దానివల్ల మరింతమంది బందీలు విడుదలయ్యే వీలు ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ఎన్నో ప్రాణాలను కాపాడుతోందని, గాజాకు అత్యంత అవసరమైన మానవతా సాయం అందుతోందని బైడెన్ తెలిపారు. సత్ఫలితాలను ఇలాగే పొందేందుకు ఈ ఒప్పంద గడువును మరింత పెంచాలని బైడెన్ అన్నారు.
'10 మంది బందీలకు ఒకరోజు చొప్పున పొడగిస్తాం'
మరోపక్క, హమాస్ కూడా ఈ ఒప్పందం పొడిగింపును కోరుకుంటోంది. బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ సీరియస్‌గా ఉంటే ఈ ఒప్పందాన్ని పొడిగించొచ్చని హమాస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ సైతం ఒప్పందం పొడగింపునకు సానుకూలంగా ఉంది. హమాస్ అదనంగా విడుదల చేసే ప్రతి 10 మంది బందీలకు.. ఒకరోజు చొప్పున కాల్పుల విరమణను పొడగిస్తామని తెలిపింది.
'హమాస్ అంతం పక్కా'
అదే సమయంలో, హమాస్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేసి తీరుతామని సైతం ఇజ్రాయెల్ పునరుద్ఘాటిస్తోంది. గాజా పట్టీలో పర్యటిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. ఇజ్రాయెల్ బలగాలను కలుసుకుని వారికి మరింత మనోధైర్యాన్ని ఇచ్చారు. ప్రతీ బందీని విడిపిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమకున్న మూడు లక్ష్యాల్లో.. హమాస్ అంతం, బందీల విడుదల, భవిష్యత్ ముప్పులు నివారించడం ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గాజాలో ఇజ్రాయెల్ అనుకూల పాలనను ప్రస్తావించారు. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన శక్తియుక్తులన్నీ తమకు ఉన్నాయని నెతన్యాహు స్పష్టం చేశారు.