Israel Hamas Ceasefire 2023 :ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఏడోరోజుకు పెరిగింది. రెండోవిడత కాల్పుల విరమణ ఒప్పందం గురువారం ఉదయం ముగియటం వల్ల.. మరోరోజు పొడిగించేందుకు ఇజ్రాయెల్-హమాస్ మిలిటెంట్లు అంగీకరించినట్లు ఖతార్ ప్రకటించింది. తొలుత నాలుగు రోజులు, రెండోసారి రెండు రోజులు, మూడోసారి ఒకరోజు కాల్పుల విరమణకు ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. బందీల విడుదల కొనసాగించేందుకు వీలుగా.. మధ్యవర్తుల ప్రయత్నాలు, నిబంధనల మేరకు.. కాల్పుల విరమణ కొనసాగుతుందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
అంతకుముందు ఇజ్రాయెల్.. తాత్కాలిక కాల్పుల విరమణ ఆరో రోజు నేపథ్యంలో పాలస్తీనాకు చెందిన మరో 30 మంది ఖైదీలను విడుదల చేసింది. హమాస్ మిలిటెంట్లు బుధవారం పొద్దుపోయిన తర్వాత మరో 16మంది బందీలను వదిలేశారు. అందులో 10మంది మహిళలు, చిన్నారులు, నలుగురు థాయ్ పౌరులు, ఇద్దరు రష్యన్-ఇజ్రాయెల్ మహిళలు ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ విడుదల చేసిన 30మంది పాలస్తీనా ఖైదీల్లో.. సామాజిక కార్యకర్త అహెద్ తమిమి ఉన్నారు. 2017లో ఇజ్రాయెల్ సైనికుడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం వల్ల.. ప్రపంచవ్యాప్తంగా ఆమె గుర్తింపు పొందారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందంటూ నవంబరు 6న ఇజ్రాయెల్ సైన్యం ఆమెను అరెస్ట్ చేసింది. అయితే తమిమి ఖాతా హ్యాక్ అయినట్లు ఆమె తల్లి ప్రకటించింది. ఇప్పటివరకు హమాస్ మొత్తం 97మంది బందీలను వదిలిపెట్టగా.. ఇజ్రాయెల్ 210 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది.
అంతకుముందు.. తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు కోసం సంప్రదింపులు జరుగుతున్న వేళ.. హమాస్ మిలిటెంట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేస్తే.. తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ సైనికులందరినీ వదిలిపెట్టేందుకు సిద్ధమని హమాస్ సీనియర్ అధికారి ఒకరు ప్రకటించారు.