Israel Ground Attack : హమాస్ మిలిటెంట్లు సృష్టించిన మారణకాండకు ప్రతీకారంగా భీకర వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం.. గాజాలో క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ యూనిటీ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే గాజాలో అడుగు పెట్టేందుకు సన్నద్ధంగా ఉంది. హమాస్ గ్రూప్ ఉనికి భూమిపై లేకుండా చేస్తామని.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం 3,60,000 రిజర్వు ఆర్మీని రంగంలోకి దింపింది. అదనపు బలగాలను మోహరించింది. గాజా సరిహద్దుల్లో ట్యాంకులు, శతుఘ్నులు, భారీ ఆయుధాలతో ఏ క్షణమైనా క్షేత్ర స్థాయి దాడికి ఇజ్రాయెల్ దళాలు సిద్ధమయ్యాయి. అలాగే సమీపంలోని ఉన్న వేల మంది పౌరులను సైతం సైన్యం ఖాళీ చేయించింది. పదాతిదళాలతో క్షేత్రస్థాయి దాడికి తాము సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కర్నల్ రిచర్డ్ హెచ్ తెలిపారు. అయితే.. రాజకీయ నాయకత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.
ప్రభుత్వం అనుమతి ఇవ్వగానే వేల సంఖ్యలో ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంలోకి ప్రవేశించి హమాస్ మిలిటెంట్లను ఇంటింటికి వెళ్లి వెతికి మరీ మట్టుబెట్టేలా ప్రణాళిక రచించారు. ప్రభుత్వం అనుమతిస్తే క్షేత్రస్థాయిలోకి ఇజ్రాయెల్ సైన్యం వెళ్లి దాడి చేయడం 2014 తర్వాత ఇదే తొలిసారి అవుతుంది. తద్వారా ఇరువైపులా ప్రాణనష్టం మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇజ్రాయెల్ సైన్యానికి గాజా వీధుల్లో తీవ్రవాదులతో పోరాటం చేయడం అంత తేలికేమీ కాదు. ఇజ్రాయెల్ సైన్యానికి ఇలాంటి పోరాటాల్లో అనుభవం ఉన్నప్పటికీ గాజాలో జనాభా చాలా ఎక్కువ. అలాగే రహస్య సొరంగాల్లో దాక్కున్న తీవ్రవాదులను అంతమొందించడం సులభం కాదు.
ఎలాంటి హెచ్చరిక లేకుండా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి చేస్తే తమ వద్ద ఉన్న బందీలను చంపేస్తామని హమాస్ హెచ్చరించింది. మిలిటెంట్ల వద్ద.. దాదాపు 150 మంది బందీలుగా ఉన్నారు. వారిలో సైనికులు, పురుషులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే వారి సంఖ్యపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, ఔషధాలు అందకుండా చేసిన ఇజ్రాయెల్ హమాస్‌పై ఒత్తిడి పెంచుతోంది. హమాస్ బంధించిన వారందరినీ విడుదల చేసే వరకూ గాజాకు ఆహారం, నీరు, విద్యుత్ అందబోవని ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా మొత్తం అంధకారంలో చిక్కుకోగా.. ఇప్పుడు ప్రైవేటు జనరేటర్లపై ఆధారపడి.. విద్యుత్ అందిస్తున్నారు. ఇంధన దొరక్కపోతే అవి కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఆహారం, నీరు, సరకులు అందకుండా ఇజ్రాయెల్ నిలువరించడం వల్ల గాజాలో మరణాలు బాగా పెరుగుతాయని అంతర్జాతీయ సహాయక బృందాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే గాజాలోని ఐదింటిలో మూడు వాటర్ ప్లాంట్లు మూతపడ్డాయని రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ సీనియర్ ప్రతినిధి ఒకరు హెచ్చరించారు. విద్యుత్ లేకపోతే పాలస్తీనా ఆసుపత్రుల్లో పరిస్థితులు ఘోరంగా మారతాయని కాబట్టి బందీలను విడుదల చేయాలని హమాస్‌కు సూచించారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల నిరాశ్రయులైన వారి సంఖ్య 24 గంటల్లో 30శాతం పెరిగి 3 లక్షల 39 వేలకు చేరిందని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. వారిలో మూడింట రెండొంతుల మంది ఐక్యరాజ్యసమితి పాఠశాలల్లోనే ఉన్నారు.