Israel Gaza War Updates : ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఒక్కరోజే దాదాపు 700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్, ఇంధన నిల్వలు లేకపోవడం వల్ల జనరేటర్లు పనిచేయడంలేదని పాలస్తీనా వైద్యశాఖ అధికారులు వాపోయారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా జరిగిన నష్టంతో అనేక కేంద్రాలు మూసివేయాల్సి వచ్చిందని తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన
Israel Hamas War WHO : మరోవైపు, గాజాలో దాదాపు మూడింట రెండొంతుల ఆరోగ్య కేంద్రాలు పని చేయడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. గాజా వ్యాప్తంగా 72 ఆరోగ్య సంరక్షణా కేంద్రాలకు గాను 46 కేంద్రాలు పనిచేయడం మానేశాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో 35 ఆస్పత్రులకు గాను 12 ఆస్పత్రులు కూడా పనిచేయడం లేదని పేర్కొంది.
ఇజ్రాయెల్ దాడుల్లో కుప్పకూలిన గాజా భవనాలు 'నరకంలోంచి బయటకు వచ్చినట్టుంది'
Hostages Released By Hamas : హమాస్ మిలిటెంట్లు తాజాగా మరో ఇద్దరు బందీలను విడిచిపెట్టారు. అందులో 85 ఏళ్ల వృద్ధురాలు లిఫ్‌సిట్జ్ ఉన్నారు. ఆమె మిలిటెంట్లతో తన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. హమాస్ చెర నుంచి బయటికి రావడం నరకంలోంచి బయటకు వచ్చినట్టుందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ క్షేత్రంలో ఉండగా హమాస్ మిలిటెంట్లు తనను ద్విచక్ర వాహనంపై అపహరించారని ఆమె తెలిపారు. ఆ సమయంలో తాను ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడినట్లు వివరించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా సరిహద్దు వెంబడి బిలియన్ డాలర్లు వెచ్చించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా హమాస్ మిలిటెంట్ల చొరబాటును అది అడ్డుకోలేకపోయిందని విమర్శించారు.
ఇజ్రాయెల్ దాడుల్లో కుప్పకూలిన గాజా భవనాలు 'సాలీడు నిర్మించుకునే గూడులా'
Hostages Released Today : లిఫ్‌సిట్జ్ మాటలు విలేకరులకు అర్థం కాకపోవడం వల్ల ఆమె కుమార్తె షారోన్ తన తల్లి చెబుతున్న మాటలను అనువాదం చేసింది. తన తల్లిని మిలిటెంట్లు కర్రలతో కొట్టినట్లు ఆమె ఆరోపించింది. ద్విచక్ర వాహనంపై గాజాలోకి అడుగుపెట్టగానే తన తల్లిని తడి నేలలో కొన్ని కిలోమీటర్ల మేర నడిపించారని వెల్లడించింది. హమాస్ మిలిటెంట్లు ఏర్పాటు చేసుకున్న సొరంగాల నెట్‌వర్క్.. సాలీడు నిర్మించుకునే గూడులా ఉందని పేర్కొంది. ద్విచక్ర వాహనంపై తన తల్లిని మిలిటెంట్లు అపహరించిన సమయంలో నగలు, వాచ్‌ను తీసుకున్నారని చెప్పింది. తన తల్లితో పాటు 24 మందిని సొరంగాల్లోకి తీసుకెళ్లారని పేర్కొంది. అక్కడ గార్డులు, పారామెడికల్ సిబ్బందితో పాటు వైద్యుడు ఉన్నట్లు వివరించింది..
ఉత్తర గాజా ప్రజల పరిస్థితి దారుణంగా..
North Gaza People Back : ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికలతో ఆ ప్రాంతాన్ని వీడి దక్షిణ గాజాకు తరలిపోయిన 11 లక్షల మంది పాలస్తీనా వాసులు మళ్లీ ఉత్తరగాజా బాటపట్టారు. దక్షిణ గాజాలో వసతి సౌకర్యాలు లేక పరిస్థితులు దారుణంగా ఉన్న వేళ మళ్లీ తమ సొంత ఇళ్లకు ఉత్తర గాజా వాసులు పయనమవుతున్నారు. దక్షిణ గాజాలో వసతి, ఆహారం, తాగునీరు కొరతతో పాలస్తీనా వాసులకు దిక్కుతోచడం లేదు. దక్షిణగాజాలోని ఖాన్ యూనిస్ నగరానికి దాదాపు 7 లక్షల మంది తరలిరాగ వారందరికీ ఆశ్రయం దొరకడం లేదు. చాలా మంది ఆస్పత్రులు, క్లబ్‌లు, రెస్టారెంట్లలో తలదాల్చుకోవాల్సి వస్తోంది. అనేక మంది వీధుల్లోనే నిద్రిస్తున్నారు. చాలా మంది రోజుకు ఒక లీటరు నీరే తాగుతున్నారు. ఒకటి, రెండు అరబిక్ రొట్టెలు తిని బతుకుతున్నారు.
అనేక మంది మురుగునీటినే..
Gaza People Situation : ఉత్తరగాజాను తక్షణం ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ చేసిన హెచ్చరికతో ఇళ్లు, వ్యాపారాలు సహా జీవనాధారాన్ని విడిచిపెట్టి దక్షిణ గాజాకు వెళ్లిన ఉత్తరగాజా వాసులకు అక్కడ ఆశ్రయం లభించడం లేదు. తిండి కూడా దొరకడం లేదు. అనేక మంది మురుగునీటినే తాగాల్సి వస్తోంది. దక్షిణ గాజాలో పరిస్థితి దారుణంగా ఉందని విదేశీ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఉత్తరగాజాలో గాజా నగరం నుంచి దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరానికి వచ్చిన వారు ఇజ్రాయెల్ అక్కడ కూడా బాంబుదాడులు చేయడం వల్ల తమకు సురక్షితమైన ప్రదేశమంటూ లేకుండా పోయిందని వాపోతున్నారు.
నెతన్యాహుతో ఫ్రాన్స్ అధ్యక్షుడు భేటీ
Macron Netanyahu :ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో పోరాడుతున్న అంతర్జాతీయ సంకీర్ణాన్ని హమాస్‌పై యుద్ధానికి కూడా విస్తరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ పిలుపునిచ్చారు. హమాస్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు మెక్రాన్ జెరూసలెం చేరుకున్నారు. అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాక్రాన్ సమావేశమయ్యారు. ఇజ్రాయెల్, ఫ్రాన్స్‌లకు ఉగ్రవాదం ఉమ్మడి శత్రువని పేర్కొన్నారు. ఇరాన్, హిజ్బుల్లాలు బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి ప్రక్రియను పునః ప్రారంభించాలని సూచించారు. గాజాలో బందీలుగా ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో ఇజ్రాయెల్ ఒంటరిగా ఉండకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. శాంతిని పునరుద్ధరించడానికి తమ వంతు సాయం చేస్తామని నెతన్యాహుకు హామీ ఇచ్చారు.
Israel Hamas War : గాజాలో ఒకేరోజు 320 'టార్గెట్ల'పై దాడి.. క్షణాల్లో భవనాలన్నీ నేలమట్టం.. 'ఇంకా కొన్ని నెలల పాటు యుద్ధమే!'
Israel Palestine Conflict : గాజాకు అందని ఇంధనం.. ఆస్పత్రులు ఫుల్.. మరింత దయనీయంగా రోగుల పరిస్థితి