Israel Gaza War Updates : ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమై నెల రోజులైనా పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. గత నెల 7న హమాస్ ఆక్మసిక దాడులు చేసినప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో ఇప్పటికే 10వేల మందికిపైగా మరణించారు. మరోవైపు మానవతా సాయం అందక దాదాపు 23లక్షల మంది.. తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, తాగునీరు, ఇంధనం, విద్యుత్, ఔషధాలు అందక గాజావాసులు అల్లాడుతున్నారు. విద్యుత్, ప్రాథమిక వైద్య సామగ్రి అందుబాటులో లేకపోవడం గాజా ఆస్పత్రులు.. మూతపడే దశకు చేరుకున్నాయి. అనస్థీషియా(మత్తుమందు) ఇవ్వకుండానే చిన్నారులకు వైద్య చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. కనీసం గాయాలు శుభ్రం చేసుకోవడానికి కూడా నీరు లేకపోవడం వల్ల నరకం చూస్తున్నారు. శారీరకంగా, మానసికంగా చాలా అలసిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు.
'ఇజ్రాయెల్ ఆక్రమణను అంగీకరించం'
Israel Gaza America : మరోవైపు, గాజాను ఇజ్రాయెల్ తిరిగి ఆక్రమించుకునేందుకు అంగీకరించేది లేదని అమెరికా తేల్చి చెప్పింది. అలాంటి చర్యలకు జో బైడెన్ ప్రభుత్వం.. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ స్పష్టం చేశారు. యుద్ధం ముగిశాక.. తామే గాజాలో భద్రతా బాధ్యతను చేపట్టే అవకాశాలున్నాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన క్రమంలో అగ్రరాజ్యం తన వైఖరిని స్పష్టం చేసింది. యుద్ధానంతరం.. గాజా ఎలా ఉండాలని చర్చలతోనే నిర్ణయించాలని జాన్ కిర్బీ పేర్కొన్నారు. మళ్లీ హమాస్ దాడులు, యుద్ధాలు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. పాలస్తీనా భూభాగమైన గాజాను ఆక్రమించడం తప్పు అని ఇదివరకే ఇజ్రాయెల్‌కు బైడెన్ తెలిపినట్లు గుర్తుచేశారు.
ఇజ్రాయెల్, అమెరికా మధ్య దూరం!
Israel America Relationship :తాజా పరిణామాలు ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొంత వరకు దూరం పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే పాలస్తీనా శరణార్థి శిబిరాలపై దాడులు చేయడాన్ని అమెరికా తప్పుబట్టింది. అలాగే అమాయక ప్రజలకు మానవతాసాయం అందేలా అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌పై ఒత్తిడి చేసినట్లు సమాచారం. హమాస్ చేసిన దాడులకు సాధారణ పౌరులను హింసకు గురిచేయవద్దని బ్లింకెన్ వెల్లడించారు. గాజా భద్రతపై నెతన్యాహు చేసిన వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ ప్రభుత్వ సలహాదారు మార్క్ రెగెవ్ వివరణ ఇచ్చారు. తమకు గాజాను పాలించాలని లేదనీ.. అయితే సైనిక పరంగా భద్రతా ఏర్పాటు చేయాలనుకున్నట్లు తెలిపారు. యుద్ధానంతరం అంతర్జాతీయ సాయంతో గాజా పునర్నిర్మాణం జరుగుతుందని వివరించారు.